35.. 50.. 70.. ఈ అంకెలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కలవరపెడుతున్నాయి. ఒక్క జగనే కాదు.. వైసీపీ పెద్దలందరూ హడలి పోతున్నారు. ఎందుకంటే ఇవి అంకెలు కాదు, వైసీపీ జాతక ఫలితాలు అంట. ఏంటా ఈ అంకెలు అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓ సర్వే ప్రకారం.. వైసీపీకి 30 సీట్లు కన్నా ఎక్కువ రావని తేలిందట. వైసీపీ సొంత సర్వేలో తేలిన ఈ ఫలితం గోప్యంగా ఉంచుదాం అనుకునేలోపే లీకైపోయిందని వైసీపీ వర్గాలు బోరుమంటున్నాయి.
ఇదే సందర్భంలో రాయలసీమ పెద్దాయన చేసిన మరో సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు దక్కుతాయట. క్షేత్ర స్థాయిలో పార్టీ అన్నది ఆశించిన విధంగా బలోపేతం అవకపోగా బలహీనపడిందని రెండు సర్వేలలో కనిపించిన కామన్ షాక్. రెండింటిలోను నెగెటివ్ ఫలితాలు రావడం వల్లే సీఎం జగన్ కలవరపాటుకు గురయ్యారట.
ఇక గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చాలా మంది నిర్వహించడం లేదు. రీజనల్ కో ఆర్డినేటర్లూ యాక్టివ్ గా లేరు. దీంతో 70 మంది ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల మంత్రులు సంయమనం కోల్పోవడం కూడా పార్టీకి చేటు తెస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో తక్షణ దిద్దుబాటు చర్యలే పార్టీనీ, తననూ రక్షిస్తాయని, అవే శ్రీ రామ రక్ష అవుతాయని ఆయన భావిస్తున్నారట.
చాలా చోట్ల మంత్రుల తీరు కారణంగా నష్టం వాటిల్లుతోందని గ్రహించి, వారిని పిలిపించి మాట్లాడాలని కూడా యోచిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరణపై ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని, దీంతో పథకాలు ఎవరు అమలు చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఎక్కువ శాతం గ్రామీణ, పట్టణ ప్రాంత లబ్ధిదారులు ఉన్నారని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates