బెజవాడ టీడీపీలో అయోమయం పెరిగిపోతోంది. ఒకవైపు కేశినేని చిన్ని పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నానియే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేస్తారంటు ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. దాంతో అసలిద్దరిలో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసేది ఎవరనే విషయంలో పార్టీలోనే అయోమయం పెరిగిపోతోంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇద్దరు కూడా స్వయానా అన్నదమ్ములు కావటమే.
వీళ్ళిద్దరు అన్నదమ్ములు కావటంతోనే ఇద్దరిలో ఎవరికి మద్దతుగా నిలవాలో చాలామంది నేతలకు, క్యాడర్ కు అర్ధం కావటం లేదు. ఎంపీ విషయాన్ని తీసుకుంటే కొంతకాలం అసలు పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటారు. హఠాత్తుగా ఏదో కార్యక్రమంలో ప్రత్యక్షమై హడావుడి చేస్తారు. చంద్రబాబు నాయుడు తో కూడా అంటీ ముట్టనట్లే ఉంటారు. మళ్ళీ ఒకసారి సుదీర్ఘంగా సమావేశమవుతారు. విజయవాడలోని బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా తో ఎంపీకి పడటం లేదని అందరికీ తెలిసిందే.
కాబట్టి పై ముగ్గురు నేతలు ఎంపీకి వ్యతిరేకంగానే రాజకీయాలు చేస్తుంటారు. ఇదే సమయంలో ఎంపీ కూడా వాళ్ళ వ్యతిరేక వర్గాన్ని దగ్గరకు తీస్తున్నారు. రెండువైపులా సర్ది చెప్పటానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో చంద్రబాబు ఇద్దరినీ వదిలేశారు. ఈ నేపధ్యంలోనే ఎంపీ సోదరుడు చిన్ని రంగంలోకి దూకారు. చంద్రబాబు ఒకటికి రెండుమూడుసార్లు భేటీ తర్వాత ఒక్కసారిగా పార్టీలో యాక్టివ్ అయ్యారు. దాంతో నేతలు, క్యాడర్లో మరింత గందరగోళం పెరిగిపోయింది. చిన్ని తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో క్యాడర్ తో వరసగా సమావేశమయ్యారు.
తాజాగా వంగవీటి రాధాకృష్ణ తో కూడా భేటీ అయ్యారు. దీంతో చిన్ని, నాని వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసేది ఎవరో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉంది. ఇదే విధమైన అయోమయం కంటిన్యూ అయితే చివరకు నష్టపోయేది పార్టీయే. చివరి నిముషంలో చంద్రబాబు గనుక టికెట్ ఎవరికో ఫైనల్ చేస్తే కచ్చితంగా రెండో వాళ్ళు పార్టీకి నష్టం చేసే అవకాశముంది. కాబట్టి అయోమయం ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంతమంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates