ఆ రెండు ఖాళీల్లో ఒకటి ఆయనకు జగన్ ఇస్తారా?

అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది రాజకీయాలు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఈ రంగంలో కనిపిస్తుంది. అన్నింటికి మించి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో కానీ.. పదవుల ఎంపికలోనూ కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటిలో లాభపడే వారు కొందరుంటే.. నష్టపోయే వారు మరికొందరు ఉంటారు. ఇప్పుడు అలాంటి లక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఒకప్పుడు చంద్రబాబుకు వీరవిధేయుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు (పిల్లి, మోపిదేవి) రాజ్యసభకు ఎంపిక కావటంతో.. వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. దీంతో.. ఖాళీ అయ్యే రెండు స్థానాల్ని బీసీలకే కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటివేళ.. తెర మీదకు అనూహ్యంగా ఉమ్మారెడ్డి పేరు వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి స్థానంలో అదే జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో సీనియర్ నేతగా..అనుభవం ఉన్నఆయనకు మంత్రి పదవి ఇస్తే.. పార్టీలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరన్న మాట వినిపిస్తోంది.

దీనికి తోడు.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా.. ఆ సామాజిక వర్గానికి జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు అవుతుందని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి పదవిని ఉమ్మారెడ్డికి ఇస్తే.. ఎవరూ ఏమీ అనుకోరన్న మాట వినిపిస్తోంది. గడిచిన కొంతకాలంగా తన రాజకీయ జీవితంలో భారీ ఎదురు దెబ్బలు తిన్న ఉమ్మారెడ్డికి మంత్రి పదవి కానీ దక్కితే.. అదో ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు. మరి.. జగన్ ఏం చేస్తారో చూడాలి.