మన వేలితే మన కంటినే పొడిచే రకం చైనా. ఆ దేశానికి ప్రపంచంలో అత్యధిక ఆధాయం అందించే దేశం ఇండియానే. ఐతే ఆ ఆదాయంతోనే పాకిస్థాన్‌కు సాయం చేస్తుంది. మనపై దండయాత్ర చేస్తుంది. మన సరిహద్దుల్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఐతే ఇది ఎప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఆ దేశ బలం, దానితో దౌత్య సంబంధాలు, వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడి ఉండటం లాంటి కారణాలతో భారత్ ఏ చర్యలూ చేపట్టేది కాదు.
కానీ ఇటీవల గాల్వాన్ లోయలో చైనా దుందుడుకు చర్యల కారణంగా 21 మంది సైనికుల ప్రాణాలు పోవడంతో భారత్ ఇక ఎంతమాత్రం ఆ దేశాన్ని ఉపేక్షించూడదని నిర్ణయించుకున్నట్లే ఉంది. క్రమంగా ఆ దేశంతో అన్ని సంబంధాలూ తెంచుకునే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.
మరోవైపు ఇండియాలో చైనా పెట్టుబడులు తగ్గించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇండియాలో ఇకపై రోడ్ల నిర్మాణంలో చైనా భాగస్వామ్యం లేకుండా చూడాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయించారు. జాయింట్ వెంచర్లతో పాటు రహదారి నిర్మాణాలు వేటిలోనూ చైనా కంపెనీలను, పెట్టుబడులను అనుమతించకూడదని సంబంధిత శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
‘‘చైనా భాగస్వామ్యంతో ఉన్న జాయింట్ వెంచర్లు భారత్‌లో రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అనుమతించం. చైనా కంపెనీల్ని నిషేధిస్తూ.. మన దేశ కంపెనీలు మాత్రమే వీటిలో పాలుపంచుకునేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకొస్తున్నాం. భవిష్యత్తులోనూ టెండర్లలో చైనా కంపెనీలకు అవకాశమే లేకుండా చూస్తాం. టెక్నాలజీ, రీసెర్చ్ సంబంధిత ఎంఎస్ఎంఈల్లో విదేశీ కంపెనీలను జాయింట్ వెంచర్లను అనుమతిస్తాం. కానీ చైనా కంపెనీలకు మాత్రం అవకాశం లేదు’’ అని గడ్కరీ స్పష్టం చేశారు.