కేసీయార్ కు ఏపీ బుల్లెట్ ప్రూఫ్

తెలంగాణ సీఎం కేసీయార్ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో రెడీ అవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని వీరపనేనిగూడెంలో ఇవన్నీ సిద్ధమవుతున్నాయి. కేసీయార్ భద్రతా చర్యల్లో భాగంగా 8 వాహనాలను బుల్టెట్ ప్రూఫ్ చేయించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిసైడ్ చేసింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా వీలైనంత తొందరలో అత్యంత రక్షణగా ఉండే వాహనాలను వెంటనే రెడీ చేయాలని పోలీసులు ఉన్నతాధికారులు అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలను హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. వీటన్నింటినీ వీరపనేనిగూడెంలోని ఒక బాడీ బిల్డింగ్ యూనిట్ కు తరలించారు. ఇక్కడే వీటన్నింటికీ బుల్లెట్ ప్రూప్ బాడీ రెడీఅవుతుంది. ఒకపుడు కార్లు, బస్సులు తదితరాలను బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాలంటే పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు పంపేవారు. అక్కడ ప్రయారిటి జాబితాలో చాలాకాలం పట్టేది.

ఉమ్మడి ఏపీ కానీ లేదా విడిపోయిన రాష్ట్రాల నుండైనా పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు వాహనాలను పంపటం, మళ్ళీ అక్కడి నుండి రెడీ అయిన వాహనాలను తెప్పించుకోవటానికి చాలా కాలంపడుతోంది. వీటన్నింటినీ గమనించిన సదరు బాడీ బిల్డిండ్ యూనిట్ యాజమాన్యం విజయవాడకు సమీపంలోని వీరపనేనిగూడెం దగ్గ పెద్ద యూనిట్ ను ఏర్పాటుచేశారు. ఇపుడు కేసీయార్ భద్రత కోసం 8 కార్లతో పాటు 2 బస్సులను కూడా విజయవాడ దగ్గరకు తరలించారు.

వీరపనేనిగూడెంలోని యూనిట్ లో ఏపీ, తెలంగాణాతో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ నుండి కూడా ప్రభుత్వ వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ చేయించుకునేందుకు ఇక్కడకే వస్తున్నాయి. ప్రభుత్వ వాహనాలతో పాటు బాగా ధనవంతులు కూడా తమ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకునేందుకు వాహనాలను ఇక్కడకే పంపుతున్నారు. వచ్చే ఆర్డర్లలో ప్రయారిటి ప్రకారం యాజమాన్యం రెడీ చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి మరో వారంలో కేసీయార్ భద్రతా వాహన శ్రేణి బుల్లెట్ ప్రూఫ్ అయిపోవచ్చని సమాచారం.