భారీ వర్షాల వెనక విదేశీ కుట్ర ఉందనడం… క్లౌడ్ బరస్ట్ అని వ్యాఖ్యానించడం.. ఈ శతాబ్దపు జోక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎంను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగడంతోపాటు ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలన్నారు. సీఎం చేసిన కామెంట్లు జోకర్‌ను తలపిస్తున్నాయని దుయ్యబట్టారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయని… ఈసారి కూడా వచ్చాయని.. భవిష్యత్తులో రావని కూడా చెప్పలేమన్నారు. కానీ కేసీఆర్కు మాత్రం భారీ వర్షాలు మానవ సృష్టిలా కన్పిస్తోందని… పైగా విదేశాల కుట్ర అంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందని ఎద్దేవా చేశారు.
మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని వివరించారు. భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఇస్తామన్న రూ.10 వేలు ఏ మాత్రం సరిపోవన్నారు.
వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వందలాది గ్రామాలు వరద ముంపునకు గురై వేలాది మంది నిరాశ్రయులుగా మారితే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లోనున్న ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ కేంద్రాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకు వెచ్చిస్తున్న సమయాన్ని బాధితులను ఆదుకునేందుకు.. సహాయక చర్యలపై వెచ్చిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని బండి సంజయ్ హితవు పలికారు.