రాజు గారికి జ‌గ‌న్ ఫినిషింగ్ ట‌చ్ ఇదేన‌ట‌

వైఎస్ఆర్‌సీపీ నేత‌, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌ల‌క‌లం ఊహించ‌ని మలుపులు తిరుగుతోంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటు ఎంపీ త‌మ మొండి ప‌ట్టును కొన‌సాగిస్తుండ‌టంతో ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని రాజ‌కీయ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో న‌ర‌సాపురం ఎంపీపై అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ ఉంద‌ని తెలుస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌డుతూ ర‌ఘురామ కృష్ణంరాజు క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ర‌ఘురామ‌కృష్ణంరాజు లోక్‌స‌భ‌ స్పీక‌ర్‌, కేంద్ర హోంశాఖ‌కు లేఖ రాశారు. అనంత‌రం ఆయ‌న‌ పార్టీ నిబంద‌న‌లు ఉల్లంఘిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చింది. అయితే, ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆ నోటీసుల‌కు ఊహించ‌ని స్పంద‌న ఇచ్చారు.

ఢిల్లీ వెళ్లిన ర‌ఘురామ‌కృష్ణంరాజు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం, కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో వైసీపీ పెద్ద‌ల‌కు షాక్ ఇచ్చారు. ఇక్క‌డితో ఆపేయ‌కుండా త‌న‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీసు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. తాను యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో పోటీచేశాన‌ని, త‌న‌కు నోటీసు ఇచ్చిన లెట‌ర్ హెడ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంద‌ని లాజిక్ లేవ‌నెత్తారు. లెట‌ర్ హెడ్‌కు, త‌న‌కు పోటీ స‌మ‌యంలో ఇచ్చిన‌ బీఫామ్‌కు తేడా ఉంద‌ని పేర్కొంటూ నోటీసుకు చ‌ట్ట‌బ‌ద్ధత ‌లేదని ట్విస్ట్ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైసీపీ అధిష్టానాన్ని, ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేస్తున్న త‌రుణంలో, వైసీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉండ‌ట‌మే కాకుండా ఆయ‌న చ‌ర్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం, ఎంపీపై అన‌ర్హ‌త పిటిష‌న్ వేయ‌డంపై వివిధ ర‌కాల స‌మీక‌ర‌ణాలు పరిశీలించిన అనంత‌రం అన‌ర్హ‌త‌కే వైసీపీ మొగ్గు చూపింద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురామ‌కృష్ణంరాజు పై త్వ‌‌ర‌లోనే లోక‌స‌భ స్పీక‌ర్‌కు అన‌ర్హ‌త పిటిష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉందని స‌మాచారం. త‌ద్వారా ఆయ‌న తొడ‌గొడుతున్న తీరుకు జ‌వాబు ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం.