టీడీపీ వ‌ర్సెస్‌ వైసీపీ.. స‌ర్వే ఫైట్‌..!

ఏపీలో మ‌రో వివాదం.. రెండు ప్ర‌ధాన పార్టీల‌నూ కుదిపేస్తోంది. అదే.. స‌ర్వే రిపోర్టు. తాజాగా సెంట‌ర్ ఫ‌ర్ నేష‌న‌ల్ స్ట‌డీస్ అనే సంస్థ‌.. ఒక స‌ర్వే నిర్వ‌హించింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల ప్రోగ్ర‌స్‌పై.. ఈ సంస్థ రెండు రోజుల కింద‌టే స‌ర్వే రిపోర్టు ఇచ్చింది. దీనిలో దేశంలోని 25 మంది ముఖ్య‌మంత్రుల ప‌నితీరుకు మార్కులు వేసింది. తొలిస్థానంలో ఒడిసా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఉన్నారు. దీనిపై ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు.

అయితే.. ఇదే స‌ర్వేలో .. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను 20వ స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. మ‌రోవైపు.. పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 11వ స్థానంలో ఉన్న‌ట్టు చూపించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న ముఖ్య‌మంత్రుల జాబితా అంటూ.. పెద్ద ఎత్తున ఈ స‌ర్వే.. సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అయింది. అయితే.. ఇదే ఇప్పుడు టీడీపీ-వైసీపీల మ‌ధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది. ఎందుకంటే.. కొన్నాళ్లుగా చేస్తున్న స‌ర్వేల్లోల సీఎం జ‌గ‌న్‌.. తొలి 5 స్థానాల్లో ఉంటున్నారు.

గ‌త ఏడాది చేసిన ఓ స‌ర్వేలోనూ.. ఆయ‌న 4వ స్థానంలో నిలిచారు. అలాంటి నాయ‌కుడు ఒక్క‌సారిగా 20 వ స్థానంలోకి ప‌డిపోవ‌డం అంటే.. ఇది టీడీపీ ఆడించిన నాట‌కంగా.. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని .. మ‌రో అడుగు ముందుకు వేసి.. టీడీపీ రాజ‌కీయ స‌ల‌హాదారు.. రాబిన్ శ‌ర్మ నేతృత్వంలోనే ఈ స‌ర్వే సాగింద‌ని.. కాబ‌ట్టి.. దీనిని విశ్వ‌సించాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు.. మ‌న‌స్పూర్తిగా నిద్ర‌పోయేందుకు ఈ స‌ర్వే చేయించార‌ని.. వ్యాఖ్యానించారు.

అయితే.. దీంతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో స‌ర్వే.. మంట‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. స‌ర్వే చేసిన సంస్థ‌.. ఏ ప్రాతిప‌దిక‌న‌.. ఈ రిజ‌ల్ట్ ప్ర‌క‌టించింద నేది వైసీపీ నేత‌ల సందేహం. ఇప్ప‌టి వ‌ర‌కు ముందు వ‌రుస‌లో ఉన్న‌త‌మ ముఖ్య‌మంత్రి ఇమేజ్‌ను దెబ్బ‌తీయాల‌నే ఉద్దేశంతోనే ఇలా స‌ర్వేను వండి వార్చార‌ని.. నాయ‌కులు అంటున్నారు. వైసీపీ నుంచి తీవ్ర‌మైన ప‌దునైన రియాక్ష‌నే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.