ముప్పవరపు వెంకయ్య నాయుడు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి. త్వరలోనే(ఆగస్టు 11న) రిటైర్ కానున్నారు. అయితే.. ఆయన దీనికి ముందు.. సుదీర్ఘకాలంగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఇలా అనేక రూపాల్లో ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారనడంలో సందేహం లేదు. సరే.. రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. అనుకుంటే.. ఇలాంటి నాయకుడు మళ్లీ ఎవరున్నారు? అనేది ఇప్పుడు చర్చ.
ఎందుకంటే.. ఉపరాష్ట్రపతిగా రిటైర్ అవుతున్న వెంకయ్యకు మరోసారి చాన్స్ వస్తుందని.. రాదని.. అనేక చర్చలు తెరమీదికి వచ్చాయి. అయితే.. ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఉపరాష్ట్రపతి గా పోటీకి విముఖత చూపిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. సో.. ఆయన ఇక, రిటైర్ అయిపోవడం ఖాయం. మరి నెక్ట్స్ ఏంటి? ఆయన ఏం చేస్తారు.? అంటే.. ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక.. ఇక, సంప్రదాయం ప్రకారం.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు.
పోనీ. పరోక్షంగా అయినా.. రాజకీయాలు చేస్తారా? అంటే.. అది ఆయన ఇష్టం. కానీ.. ఒక్కమాట చెప్పుకోవాల్సి వస్తే.. ఇప్పటి వరకు ఏపీకి ఏదైనా కష్టం వస్తే.. టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. అంతో ఇంతో ఢిల్లీ వైపు చూస్తే.. కనిపిస్తున్న ‘తెలుగుముఖం’ వెంకయ్యనాయుడు ఒక్కరే. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు.. అమృత్ పథకం కానీ, అర్భన్ డెవలప్ మెంట్ విషయంలో కానీ.. అనేక ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చారు. పైగా తెలుగు వారికి కష్టం వచ్చినా..ఆయన ఆదుకున్నారు.
బాబు హయంలో హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు ప్రధాని మోడీని ఆఘమేఘాలపై ఏపీకి పంపించి.. నిధులు విడుదల చేయించారనే పేరు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ.. ఏపీకి ఏదైనా సమస్య వస్తే.. ఆయన నేరుగా కేంద్ర మంత్రులను తన వద్దకు పిలిపించుకుని పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన రిటైర్ అయితే.. నెక్ట్స్ ఎవరు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ తరహాలో కేంద్రంలో చక్రం తిప్పే నాయకులు లేకపోవడంతోపాటు.. బీజేపీ పెద్దలను తనదైన శైలిలో తనవైపు తిప్పుకొనే నాయకులు కూడా కనిపించడం లేదు. అయితే.. యువ నాయకుడు కిషన్ రెడ్డి ఇప్పుడు మెరుస్తున్నారు. అయితే.. వెంకయ్య స్థాయికి ఆయన చేరాలంటే.. పది పదేహేనేళ్ల సమయం పడుతుందని పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా.. వెంకయ్య సాటి నాయకుడు.. రాజకీయాలకు దూరం కావడం.. ఏపీకి లోటనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates