జ‌య‌రాజ్-ఫీనిక్స్ కేసులో సంచ‌ల‌న తీర్పు

ఈ మ‌ధ్య కాలంలో దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన తండ్రీ కొడుకులు జ‌య‌రాజ్‌-ఫీనిక్స్ లాక‌ప్ డెత్ కేసులో మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఈ తండ్రీ కొడుకుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన శాతంకులం పోలీస్ స్టేష‌న్‌ను త‌మ అధీనంలోకి తీసుకోవాలంటూ తూత్తుకుడి జిల్లా రెవెన్యూ అధికారుల‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జ‌య‌రాజ్‌, ఫీనిక్స్‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఇద్ద‌రు ఎస్సైలు, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను ఇప్ప‌టికే ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వారిపై విచార‌ణ‌కు కూడా జ‌రుగుతోంది. జిల్లా స్థాయి జ‌డ్జి నేతృత్వంలో క‌మిటీ కూడా ఏర్పాటు చేసింది కోర్టు.

ఐతే విచార‌ణ‌కు ఈ పోలీస్ స్టేష‌న్లో సిబ్బంది ఎవ‌రూ స‌హ‌కరించ‌డం లేద‌ని కోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ స్టేష‌న్‌ను త‌మ అధీనంలోకి తీసుకోవాల‌ని రెవెన్యూ అధికారుల‌కు బాధ్య‌త అప్ప‌గించింది మ‌ద్రాస్ హైకోర్టు. తూత్తుకుడి జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ నందూరి ఈ విష‌యంలో రెవెన్యూ అధికారుల‌కు ఏర్పాట్లు చేయాల‌ని కోర్టు సూచించింది. 1861లో భార‌త పోలీస్ వ్య‌వ‌స్థ ఏర్పాటైంద‌ని.. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టిదాకా ఓ పోలీస్ స్టేష‌న్ మ‌రో విభాగం చేతుల్లోకి వెళ్ల‌డం జ‌ర‌గ‌లేద‌ని.. ఇది సిగ్గుచేట‌ని ఓ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. తూత్తుకుడి జిల్లాలోని శాతంకులంలో ప‌ది రోజుల కింద‌ట‌ జ‌య‌రాజ్, ఫీనిక్స్ అనే తండ్రీ కొడుకులు లాక్ డౌన్ టైంలో నిర్ణీత స‌మ‌యాన్ని దాటి షాప్ తెరిచి ఉన్నార‌న్న కార‌ణంతో పోలీసులు వారిని దండించ‌డం.. ఈ క్ర‌మంలో మాటా మాటా పెరిగి వారిని పోలీసులు తీసుకెళ్లి చిత్ర‌వ‌ధ చేసి ఇద్ద‌రి మ‌ర‌ణాల‌కు కార‌ణం కావ‌డం.. ఈ ఉదంతంపై పెద్ద దుమారం రేగడం తెలిసిన సంగ‌తే.