ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనే సామెతకు శ్రీలంకలో తాజా పరిస్ధితులే నిదర్శనం. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల వరకు అత్యంత విలాసంగా గడిపిన అధ్యక్షుడు గొటబాయ కుటుంటం ఇపుడు దేశాన్ని వదిలిపారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను ఉన్నతాధికారులు, ప్రజలు కలిసి అడ్డుకోవటంతో మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది.
శ్రీలంకలో ప్రస్తుత అరాచకానికి గొటబాయ కుటుంబమే ప్రధాన కారణం. ఎలాగంటే గొటబాయ రాజపక్స అధ్యక్షుడిగా, ఆయన సోదరుడు మహీంద రాజపక్స ప్రధానమంత్రిగా, మరో ఇద్దరు సోదరులు మంత్రులుగా సంవత్సరాలపాటు చక్రంతిప్పారు. వీళ్ళు అనుసరించిన విధానాల కారణంగానే దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించటంతో ఆకలిమంటలను తట్టుకోలేక లక్షలాదిమంది జనాలు తిరుగుబాటు లేవదీశారు.
దాంతో ముందు ప్రధాని, ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. అయితే అధ్యక్షుడు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాజపక్స కుటుంబ సభ్యులు 15 మంది దుబాయ్ కు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎయిర్ పోర్టులో అప్పటికే ఉన్న చాలామందిని కాదని ముందు తమ పాస్ పోర్టులు, వీసాలను ప్రాసెస్ చేయాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. అందుకు నిరాకరించటంతో వీఐపీ లాంజ్ లో పెద్ద గొడవైంది. దాంతో వాళ్ళంతా రాజపక్స కుటుంబసభ్యులన్న విషయం బయటపడింది.
దాంతో అక్కడున్న జనాలంతా కుటుంబసభ్యులను చుట్టుముట్టి గొడవ మొదలుపెట్టారు. ఈ గొడవలోనే దుబాయ్ కు వెళ్ళాల్సిన విమానం కాస్త వెళ్ళిపోయింది. దాంతో చేసేదిలేక కుటుంబసభ్యులంతా తమ మద్దతుదారులతో విమానాశ్రయం నుండి పారిపోయారు. ఇదే సమయంలో బుధవారం రాజీనామా చేస్తానన్న రాజపక్స రాజీనామాపై తాజాగా ఒక షరతు విధించారు. తమను దేశంవిడిచి వెళ్ళనిస్తేనే అధ్యక్షుడిగా రాజీనామా చేస్తానని మెలికపెట్టారు. దీన్ని జనాలు అంగీకరించటం లేదు. చివరకు ఏమవుతుందనేది వేరే విషయం. ఓడలు బండ్లవుతాయనే సామెతకు రాజపక్స కేంద్రంగా జరుగుతున్న పరిణామాలే తాజా ఉదాహరణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates