టిక్ టాక్.. భారతీయుల జన జీవనంలో భాగం అయిపోయిన యాప్ ఇది. మారుమూల ప్రాంతాల్లోని వాళ్లు కూడా సిగ్గు, బిడియం అన్నీ విడిచిపెట్టి తమ టాలెంట్ ప్రదర్శించేస్తున్నారు ఈ యాప్ ద్వారా. ఐతే ఈ యాప్‌లో మరీ శ్రుతి మించి పోయి ప్రవర్తించే వాళ్లూ లేకపోలేదు.
అలాంటి పోకడలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోవడం.. మన సంస్కృతికే అది ముప్పులా పరిణమించడం.. జనాల్లో ద్వేషం, సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి ఈ యాప్ కారణమవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ‘టిక్ టాక్’ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు కూడా మొదలైపోయాయి. ఈ యాప్‌కు భారీగా రేటింగ్ పడిపోవడం కూడా తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం దేశంలో నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో ‘టిక్ టాక్’ను కూడా చేర్చింది. ఇది చైనా యాప్ అన్న సంగతి తెలిసిందే.
ఐతే ఒకేసారి 59 యాప్‌లను ప్రభుత్వం నిషేధించినా.. అందరూ మాట్లాడుకుంటున్నది మాత్రం ‘టిక్ టాక్’ గురించే. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అత్యధికులు ఉపయోగిస్తున్న యాప్‌ల్లో ఇది ఒకటి. దీనికి కోట్ల మంది బానిసలుగా మారిపోయారు. టిక్ టాక్ పని చేయకపోతే, దాన్ని తప్పనిసరిగా డెలీట్ చేయాల్సి వస్తే.. వాళ్లలో ఎంతోమంది పిచ్చోళ్లయిపోతారు. అందుకే వాళ్లందరూ టిక్ టాక్‌ను బ్యాన్ చేయొద్దంటూ గగ్లోలు పెడుతున్నారు. ఐతే జనాలకు ఇలా ఓ బలహీనతగా మారిపోయిన ఈ యాప్‌ను నిషేధించి తీరాల్సిందే అన్నది మిగతా వర్గాల మాట.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘టిక్ టాక్’ బ్యాన్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిలా ఉంటే.. నిషేధిత యాప్‌ల జాబితాలో తమది కూడా ఉండటంతో టిక్ టాక్ యాజమాన్యం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల్ని అనుసరిస్తామని.. తమ దగ్గర డేటా చోర్యం ఎంతమాత్రం జరగదని.. తాము డేటాను చైనా సహా ఎవరితోనూ పంచుకోమని ఆ సంస్థ పేర్కొంది.