బీజేపీకి పవన్ పంచ్!


భారతీయ జనతా పార్టీతో రెండేళ్ల ముందు జనసేనకు పొత్తు అయితే కుదిరింది కానీ.. ఆ రెండు పార్టీలు కలిసి చేసిన కార్యక్రమాలేవీ లేవనే చెప్పాలి. పొత్తులో ఉన్నాం అని ఇరు పార్టీల అగ్ర నేతలు అప్పుడప్పుడూ నొక్కి వక్కాణించడం మినహాయిస్తే.. జనాలకైతే ఆ రెండు పార్టీలు కలిసి ఒక కార్యాచరణతో వెళ్తున్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదు.

బీజేపీతో జట్టు కట్టాక పవన్‌ కోరుకున్న నైతిక మద్దతు ఆ పార్టీ నుంచి, కేంద్ర నాయకత్వం నుంచి రాలేదు. అదే సమయంలో బీజేపీ కూడా జనసేనతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేయలేదు. దీంతో వీరి బంధం ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది.

ఓవైపు జనసేన.. అధికార వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తుంటే.. అదే పార్టీకి రహస్యంగా సహకారం అందిస్తోందనే ఆరోపణలు బీజేపీ మీద అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల భీమవరంలో జరిగిన సభ సందర్భంగా మరింతగా వైసీపీ-బీజేపీ బంధం గురించి చర్చ నడిచింది.

ఈ నేపథ్యంలో ఇక బీజేపీలో జనసేన తెగతెంపులు చేసుకోక తప్పదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జనసేన కార్యకర్తల నుంచి కూడా ఈ డిమాండ్ వినిపిస్తోంది. జనసేనాని సైతం ఇవే సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

కొన్ని రోజులుగా పవన్ కార్టూన్ల రూపంలో వైసీపీ పాలనను ఎండగడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన కార్టూన్ చూస్తే బీజేపీకి పంచ్ వేసినట్లు కనిపిస్తోంది. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తున్న జగన్ సర్కారు తీరును ఎండగట్టేలా ఉంది ఈ కార్టూన్. అందులో బడికి నడిచి వెళ్తున్న పిల్లల్ని చూసి ఒక ముసలాయన.. “మేం కూడా మా చిన్నపుడు ఐదారు క్రోసులు నడుచుకుంటూ బడికి వెళ్లేవారం రా మనవడా.. మళ్లిప్పుడు మీ ముద్దుల సీఎం మామా మిమ్మల్ని వెనకటి రోజులకు తీసుకెళ్తున్నాడన్నమాట” అంటున్నాడు.

ఈ పంచ్ సంగతి పక్కన పెడితే పిల్లలకు వేసిన డ్రెస్సులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అందులో ఒక పిల్లాడికి వైసీపీ రంగు డ్రెస్ వేయగా.. పక్కనున్న అమ్మాయికి బీజేపీ రంగు డ్రెస్ వేశారు. ఈ కార్టూన్‌ను షేర్ చేయడం ద్వారా వైసీపీ, బీజేపీ రహస్య బంధాన్ని పవన్ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు. దీన్ని బట్టి బీజేపీతో జనసేన విడాకులు ఎంతో దూరంలో లేవన్నమాటే.