హ‌ద్దులు చెరిపేశారు.. ప్లీన‌రీ ఉద్దేశం ఇదేనా? నెటిజ‌న్ల కామెంట్లు

ఏపీ అదికార పార్టీ వైసీపీ ప్లీన‌రీపై పార్టీ కార్య‌క‌ర్త‌లు.. నాయకులే కాదు.. ప‌రోక్షంగా ఆ పార్టీ సానుభూతి ప‌రులు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. ఏదో చెబుతారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. దానిని అందిపుచ్చుకుని ముందుకు సాగ‌వ‌చ్చ‌ని.. అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు. కానీ, ప్లీన‌రీ ఉద్దేశం మాటేమో కానీ.. ప్లీన‌రీలో రెండో రోజు నాయ‌కులు.. మంత్రులు అంద‌రూ కూడా హ‌ద్దులు చెరిపేశారు. ‘దుష్ట‌చ‌తుష్టయంపై తీర్మానం’ పేరుతో అక్క‌సు క‌క్కేశారు.

వైసీపీ వ్య‌తిరేక మీడియాపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఎక్క‌డా గ్యాప్ లేకుండా.. మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌, మాజీ మంత్రి కొడాలి నాని.. స‌హా అంద‌రూ.. ఏక‌బిగిన మీడియాపై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఇదేనా.. వైసీపీ నాయ‌కులు కానీ,కార్య‌క‌ర్త‌లు కానీ ఆశించింది? ఇదేనా.. వైసీపీ ప్లీన‌రీ ఉద్దేశం అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంతేకాదు.. కేవ‌లం జ‌గ‌న్‌ను మెప్పించ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారనే వాద‌న పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. పార్టీకి దిశానిర్దేశం ఇవ్వాల‌నేది.. ప్ర‌తి కార్య‌క‌ర్త నుంచి వినిపిస్తున్న వాద‌న‌. ఎందుకంటే.. ప్ర‌జ‌ల నుంచి అన్ని రూపాల్లోనూ వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. తాడేప‌ల్లిలో కూర్చుని.. చేసే ప్ర‌సంగాలు కాదు.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించాల‌ని వారు కోరుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి లేక‌పోవ‌డం స‌హా..క‌నీసం రోడ్డు కూడా వేయ‌లేకపోవ‌డం.. సంక్షేమ ప‌థ‌కాలు అర్హులు అంద‌రికీ అందించ‌లేకపోవ‌డం.. వంటివి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్లీన‌రీలో ఆయా అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. అయితే.. దీనికి విరుద్ధంగా.. ప్లీన‌రీ న‌డుస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. తొలిరోజు స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ విప‌క్షాలు.. మీడియాపై నిప్పులు చెరిగి.. దుమ్మెత్తి పోయ‌గా.. రెండో రోజు మంత్రుల వంతు వ‌చ్చింద‌నే టాక్‌వినిపిస్తోంది. మ‌రి ఇలా అయితే.. ప్లీన‌రి ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌శ్న‌గా మారింది.