పరారీలో మాజీ ఎంఎల్ఏ చింతమనేని

వివాదాస్పద వ్యక్తుల్లో ఒకడైన మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుసుకుని పారిపోయారు. ఇంతకీ చింతమనేని ఎందుకు పారిపోయారు ? పోలీసులు ఎందుకు దాడులుచేశారు ? ఎందుకంటే కోడిపందేల్లో పాల్గొంటున్న వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు దాడులు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంఎల్ఏతో పాటు మరికొందరు పరారైపోయారు.

ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ శివార్లలోని చినకంజర్లలో మామిడి తోటలున్నాయి. ఈ తోటల్లో జనాల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అనుమానం వచ్చిన స్ధానికులు ఆరాతీశారు. చూస్తే తోటల్లో భారీఎత్తున కోళ్ళపందేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో బుధవారం రాత్రి పోలీసులు ఒక్కసారిగా దాడులుచేశారు. అయితే చివరి నిముషంలో దాడుల విషయాన్ని గ్రహించిన కొందరు అక్కడినుండి పారిపోయారు.

పారిపోయిన వారిలో దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ తో పాటు అక్కినేని కృష్ణంరాజు అండ్ కో పరారయ్యారు. చింతమనేని, కృష్ణంరాజు, అక్కినేని సతీష్, శ్రీనులు తమ బృందాలతో పెద్దఎత్తున కోళ్ళపందేలు నిర్వహిస్తున్నారు. దాడుల్లో 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో పాటు భారీగా డబ్బులు, సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపీలోని వివాదాస్పద వ్యక్తుల్లో చింతమనేని ముందు వరసలో ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోళ్ళపందేల్లో కూడా చింతమనేని యాక్టివ్ గా పాల్గొంటారు. నిజానికి కోళ్ళపందేలను హైకోర్టు నిషేధించినా ఆచరణలో సాధ్యం కావటంలేదు. మిగిలిన విషయాల్లో రాజకీయపార్టీల నేతల మధ్య విభేదాలు ఎలాగున్నా కోడిపందేల నిర్వహణలో మాత్రం అందరు ఏకమైపోతారు. అందుకనే కోళ్ళపందేలు జరగకుండా పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇపుడు రాష్ట్రందాటి పక్కరాష్ట్రంలో ఆడుతున్నందుకే చింతమనేని బుక్కయ్యారు.