అయోమయంలో పవన్ పరిస్ధితి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి అయోమయంలో పడిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవటానికి బీజేపీకి మిత్రపక్షమే అయినా రెండుపార్టీల మధ్య కావాల్సినంత గ్యాప్ వచ్చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీలో నరేంద్రమోడి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  4వ తేదీన ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో గన్నవరంకు చేరుకుంటారు.

విమానాశ్రయం లాంజ్ లోనే కొద్దిసేపు బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. తర్వాత అక్కడినుండి భీమవరంకు వెళతారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. మళ్ళీ అక్కడినుండి గన్నవరం చేరుకుని అక్కడినుండి హైదరాబాద్ కు వెళిపోతారు. స్ధూలంగా మోడి కార్యక్రమంలో గన్నవరంలో బీజేపీ ముఖ్యనేతలు మాత్రమే హాజరవుతున్నారు.

అలాగే భీమవరంలో కూడా చాలాకొద్దిమంది నేతలకు మాత్రమే వేదికమీదకు అనుమతి లభించింది. మరీమొత్తం కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పరిస్ధితి ఏమిటి ? గన్నవరంలో కానీ భీమవరంలో కానీ పవన్ పాల్గొంటారని బీజేపీ నేతలు ఎక్కడా చెప్పటంలేదు. భీమవరం కార్యక్రమంలో పాల్గొనాలని పవన్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానం అందినట్లు కూడా ఎక్కడా వినబడలేదు. పార్టీ తరపున కూడా ఎవరు ఆహ్వానం అందినట్లు చెప్పలేదు.

మరి మిత్రపక్షమయ్యుండి పవన్ విషయంలో బీజేపీ నేతలు ఇంత నిరాధరణగా ఎలా ఉంటున్నారన్నదే అర్ధం కావటంలేదు. మోడి పర్యటన మొత్తంమీద పవన్ పాత్ర ఏమిటో ఎవరికీ తెలీటంలేదు. తాజా రాజకీయ పరిణామాల్లో పవన్ను బీజేపీ అసలు మిత్రపక్షంగా భావిస్తోందా లేదా అన్న విషయం కూడా అర్ధం కావటంలేదు. మిత్రపక్షమే అయితే గన్నవరంలో, భీమవరంలో కూడా మోడి కార్యక్రమంలో పవన్ కనబడాలి. మిత్రపక్షం కాదనుకున్నా కనీసం ప్రతిపక్షంగా అయినా భీమవరం కార్యక్రమంలో హాజరవ్వాలని పవన్ కు ఆహ్వానం అందాలి. ఎందుకంటే ప్రతిపక్షాలకు కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందాయి కాబట్టి. ఈ నేపధ్యంలోనే పవన్ పరిస్ధితి ఏమిటో తెలీక అయోమయం పెరిగిపోతోంది.