ఈ సారైనా వెంక‌య్య‌కు మోడీ జై కొడ‌తారా..?

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి అనుకున్నారు.. కానీ, రాలేదు. దేశ‌మంతా.. ఆయ‌న పేరు వినిపించినా.. క‌నీసం.. ఆయ‌న పేరును కూడా బీజేపీ నేత‌లు ప్ర‌స్తావించ‌కుండానే ద్రౌప‌దీ ముర్మును ఎంపిక చేశారు. ఆయ‌నే ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి.. ఆర్ ఎస్ ఎస్ వాది.. తెలుగు వాడు.. వెంక‌య్య‌నాయ‌కుడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్నారు. మ‌రి ఇప్పుడైనా.. ఆయ‌న‌కు కొన‌సాగింపు ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అంతేకాదు.. ప్ర‌ధాని మోడీ ఆయ‌న విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. దీనికి కార‌ణం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రకటన విడుదల కావ‌డ‌మే.

తాజాగా విడుద‌లైన నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు వారసుడు ఎవరనే అంశంపై చర్చ ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికకు చకచకా అడుగులు పడుతున్న నేపథ్యంలోనే.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రకటన విడుదలైంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

జులై 19 వరకు నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ అనివార్యమైతే.. ఆగస్టు 6వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కౌంటింగ్ కూడా అదే రోజు జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు వారసుడిగా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది.

వెంక‌య్య త‌న‌దైన ముద్ర ..

ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల కాలంలో అత్యంత సమర్థంగా సేవలందించారు వెంకయ్య. పెద్దల సభ ఛైర్మన్గా ఆయన హయాంలో రాజ్యసభ పనితీరు ఎన్నడూ లేని విధంగా నమోదైంది. ముఖ్యంగా పార్ల‌మెంట‌రీ విలువ‌కు ఆయ‌న ప్ర‌ధానంగా పెద్ద పీట వేశారు. ఎంతటివారినైనా కంట్రోల్ చేయ‌డం.. స‌భ‌లో విలువ‌లు పాటించ‌డం.. స‌భ‌కు హాజ‌రు కావ‌డం.. కీల‌క అంశాల‌పై సుదీర్ఘ చ‌ర్చ‌ల‌కు అనుమ‌తించ‌డం.. అన‌వ‌స‌ర ర‌గ‌డ‌ల‌కు ఎక్క‌డిక‌క్కడ చెక్ పెట్ట‌డం ద్వారా.. వెంక‌య్య త‌న పేరును స్థిర‌ప‌రుచుకున్నారు. అంతేకాదు.. విప‌క్షాలు సైతం మెచ్చుకునేలా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు కొన‌సాగింపు ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.