మాయదారి రోగాన్ని సీరియస్ గా తీసుకునేటోళ్లు ఉన్నారు. లైట్ తీసుకునేటోళ్లు ఉన్నారు. సమస్య తట్టనంతసేపు పట్టనట్లుగా ఉంది.. ఒక్కసారి వచ్చాక ఉక్కిరిబిక్కిరి అయ్యే వారికి కొదవ లేదు. ఎవరూ మహమ్మారి బారిన పడాలని అనుకోరు. కాకుంటే.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు.. లెక్క చేయనితనంతో అడ్డంగా బుక్ అయ్యే వారు కొందరైతే.. ఎలాంటి పాపం ఎరుగక చిక్కుకునే వారు మరికొందరు. తాజాగా వైరల్ అవుతున్న పదిహేడు సెకన్ల వీడియో తెలంగాణను వణికిస్తోంది. ఆ మాటకు వస్తే.. ఈ చిట్టి వీడియో చూసిన వారికి కరోనా తీవ్రత ఎంతన్నది కళ్లకు కట్టినట్లు కనిపించటమే కాదు.. తేడా వస్తే.. ప్రాణాలు పోయే అవకాశం ఎంతలా ఉందో చెప్పే వైనం ఇప్పుడు కొత్త ఆందోళనకు గురి చేస్తోంది.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని జవహర్ నగర్ కు చెందిన ఓ యువకుడికి పాజిటివ్ గా తేలింది. అతన్ని ఛాతీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. చిన్న వయస్కుడైన అతగాడు తాజాగా మరణించాడు. అయితే.. అతడి ఆవేదనను తెలియజేసే వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఇందులో తనకువైద్యులు ఆక్సిజన్ తీసేసినట్లుగా ఆరోపణ ఉంది. తాను ఎంత బతిమిలాడినా ఒప్పుకోవటం లేదని.. తాను చనిపోతానంటూ.. బై డాడీ.. బైడాడీ అంటూ అతడి మాటలువిన్న వారందరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
చావుకు దగ్గరైన వేళలో.. ఒక్కడిగా ఉంటూ.. తన ఫోన్ ద్వారా సెల్ఫీ వీడియో తీసుకొని తన తల్లిదండ్రులకు పంపాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఆసుపత్రి సిబ్బంది తనను పట్టించుకోవటం లేదన్న మాటతో పాటు.. తనకు చావే గతి అన్న విషయాన్ని తేల్చేసిన ఆ యువకుడి మాటలు అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి.
ఇంతకీ ఆ వీడియోలో బాధితుడి చెప్పిన మాటల్ని యథాతధంగా చూస్తే.. ‘‘వెంటిలేటర్ పీకేసిర్రు. ఊపిరాడుతలేదని చెప్తె కూడ వినకుండా వెంటిలేటర్ బంజేసిర్రు, బతిమిలాడి బతిమిలాడి సాల్ సాల్ ఐపోయింది. ఇప్పటికి మూడు గంటలైంది డాడి.. నాకు ఊపిరాడుతలేదు డాడి.. గుండె ఆగిపోయింది డాడి.. ఊపిరొక్కటే కొట్టుకుంటుంది డాడి..చచ్చి పోతున్న.. బాయ్ డాడి బాయ్.. అందరికి బాయ్ డాడి..’’ అంటూ ఆవేదనతో చెప్పిన మాటలు వీడియో పూర్తి అయిన తర్వాత కూడా చెవుల్లో గింగురుమనటం ఖాయం.
ప్రాణాలు తీసే మహమ్మారిపై పోరాడేందుకు పేషెంట్లకు తగ్గట్లు ట్రీట్ మెంట్ ఇవ్వాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా ఈ సెల్ఫీ వీడియో ఉందంటున్నారు. తెలంగాణలో కేసుల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఇబ్బంది పడుతున్న వేళలో.. సర్కారీ దవాఖానాలో పరిస్థితి తెలియజేసేలా తాజా వైరల్ వీడియో ఉందంటున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న డిమాండ్ ను పలువురు వ్యక్తం చేస్తున్నారు.