జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణాలోని నేతలతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి అందరు సిద్దంగా ఉండాలని పిలుపిచ్చారు. నేతలకు, కార్యకర్తలకు అవసరమైన రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తెలంగాణాను పక్కనపెట్టేస్తే అసలు ఏపీలోనే పార్టీ నిర్మాణం జరగలేదు. పార్టీ ఏర్పాటై పదేళ్ళయినా ఇంతవరకు గ్రామస్ధాయినుండి రాష్ట్రస్ధాయివరకు అసలు పార్టీ పూర్తిస్ధాయి కమిటిలనే నియమించలేదు.
పార్టీ కమిటీలను నియమించటం పవన్ చేతిలోని పని. ఇలాంటి కమిటీలనే వేయలేని పవన్ రాబోయే తెలంగాణా ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉండాలని పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. ఏపీలో పేరుకు మిత్రపక్షమైన బీజేపీతో పవన్ కు సరైన సంబంధాలు లేవని అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడు విడిపోదామా అన్నపద్దతిలో రెండుపార్టీలు ఉన్నట్లు ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీలో పోటీకే జనసేనపార్టీకి దిక్కులేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పట్టుమని 20 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు దొరకుతారా అనేది డౌటే.
ఇలాంటి సమయంలో పవన్ రాజకీయ దృష్టంతా ఏపీ మీదే ఉన్నది వాస్తవం. తెలంగాణాలో పార్టీ తరపున కార్యకలాపాలు దాదాపు ఏమీ జరగటంలేదు. ఇంతోటిదానికి ఎన్నికల్లో పోటీచేయటానికి రెడీగా ఉండమని నేతలకు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తారా ? లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అన్నది తెలీదు. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీతో జనసేనకు పొత్తులేదన్న విషయం అందరికీ తెలిసిందే.
ఏడాదిన్నరలో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణాలో పోటీచేయటమంటే మామూలు విషయంకాదు. ఎన్నికల్లో పోటీచేస్తే జనసేనకు వచ్చే ప్లస్సు, మైనస్సు ఏమిటో కూడా ఎవరికీ తెలీదు. ఈ విషయంలో కనీసం పవన్ కైనా అవగాహన ఉందా అనేది సందేహంగా ఉంది. ఎన్నికల్లో తనను చూసి పార్టీకి ఓట్లేసేస్తారనే భ్రమల్లో పవన్ ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే గ్రామస్ధాయి, బూత్ స్ధాయి కమిటీలు ఎంత కీలకమో పవన్ ఇంకా గుర్తించినట్లు లేదు. జనాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించుకునే యంత్రాంగం లేనపుడు అధినేతకు ఎంతటి ఛరిష్మా ఉన్నా ఉపయోగముండదు.