“ఆరు నూరైనా అంతే. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నాం” అని జగన్ కేబినెట్ స్పష్టం చేసింది. శుక్రవారం సుమారు 3 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై 30 నిముషాల పాటు చర్చించినట్టు సమాచారం. ఆఖరుకు.. ఎన్ని ఆందోళనలు వచ్చినా.. పేరు మార్పు లేదని.. అంబేడ్కర్ పేరు పెట్టితీరాలని.. సీఎం జగన్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు కేబినెట్ అంగీకరించింది. దీంతోపాటు పలు నిర్ణయాలు కూడా తీసుకుంది.
ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధుల విడుదల చేయాలని సీఎం జగన్ అధ్యక్షతన.. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సుమారు 3 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యాకానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ఈ మేరకు సర్వీసు రూల్స్ ఏర్పాటు. టూరిజం పాలసీ 2020–25 కు అనుగుణంగా తిరుపతిలో నొవొటెల్ బ్రాండ్ కింద హోటల్ నిర్మాణానికి లీజు విధానంలో భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. హరే కృష్ణా మూవ్‌మెంట్ మరియు దేవాదాయశాఖ మధ్య భూమి లీజు ఒప్పందం విషయంలో స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
70 యేళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదని, పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే అంతిమసంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.