తెలుగు మీడియా క‌థ‌నాల‌ పై వెంక‌య్య ఆవేద‌న?

ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆవేద‌న చెందారా? త‌న స‌న్నిహితుల వ‌ద్ద‌.. బాధ‌ప‌డ్డారా? అం టే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ కీల‌క నాయ‌కుడు.. స‌త్య‌కుమార్‌. అంతేకాదు.. ఏపీలోనూ.. తెలంగాణ‌లో నూ..త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంతో వెంక‌య్య త‌ల్ల‌డిల్లుతున్నార‌ని కూడా ఆయ‌న చెప్పారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు..? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం కేంద్రంలోని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ క‌మిటీ.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒడిసాకుచెందిన గిరిజ‌న నాయ‌కురాలు.. ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేశారు. అయితే.. ఆది నుంచి వెంక‌య్య‌ను ఈ సారి.. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎంపిక‌చేస్తార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ వ‌చ్చిం ది. అయితే.. దీనికి భిన్నంగా మోడీ అండ్ షాలు నిర్ణ‌యం తీసుకున్నారు.

దీంతో తెలుగు మీడియాలో వెంక‌య్యకు సంబంధించి.. అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. మోడీ టీం నుంచి వెంక‌య్య‌ను ప‌క్క‌కు త‌ప్పిస్తున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వైర‌ల్ అయింది. దీనిపైనే ఉప‌ రాష్ట్ర‌ప‌తి స్పందించార‌ని.. స‌త్య‌కుమార్ చెప్పారు. రాష్టపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయలేదనే విషయంపై రాష్ట్రంలో అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు.

రాష్ట్రంలో చాలామందికి వెంకయ్యపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని దుయ్యబట్టారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా చాలా రకాల పదవులు చేపట్టారన్నారు.

ఈ పదవులన్నీ బీజేపీ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలేనని వెంకయ్యనాయుడు పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై వెంకయ్య కూడా ఆవేదన చెందారని సత్యకుమార్ చెప్పారు. 70 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు.