కరోనాతో గేమ్స్ మనకు అవసరమా జగన్?

నలుగురికి చెప్పే స్థానంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. దేశాలకు.. దేశాల్ని.. ఒకే సమయంలో ప్రపంచం మొత్తం ఒకేలాంటి భయం.. ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి కావటం ఇప్పటివరకూ గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదేమో? రెండు ప్రపంచ యుద్ధాల సమయాల్లోనూ ఇప్పటిమాదిరి యావత్ ప్రపంచం గడగడలాడిపోలేదన్నది మర్చిపోకూడదు. తనకు తిరుగే లేదని విర్రవీగే మనిషికి దిమ్మ తిరిగేలా చేసిన కంటికి కనిపించని కరోనా వైరస్ పుణ్యమా అని 4.93లక్షల మంది ఇప్పటివరకూ మరణించగా.. దగ్గర దగ్గర కోటి మంది కరోనా బారిన పడటం తెలిసిందే.

ఇలాంటివేళలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందునా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి బాగోగులు చాలా అవసరం. అలాంటి చిన్న విషయాల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారు. విరుచుకుపడుతున్న విపత్తును అధిగమిస్తూ.. మొండితనంతో పోరాటం చేస్తున్న తరహాలో పాలిస్తున్న జగన్.. ఇప్పటికే కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు చేయటంతో పాటు.. మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పాలనా పరంగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నా.. ఆయనలోని మితిమీరిన ఆత్మవిశ్వాసం.. జగన్ ఆరోగ్యాన్ని ఎక్కడ దెబ్బ తీస్తుందన్నభయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతిక దూరం చాలా అవసరం. దీనికి తోడు.. ఒకచోట.. ఒకరికి ఒకరికి మధ్య ఎడం చాలా అవసరం. శుక్రవారం జగన్ ఛాంబర్ లో జరిగినఒక కార్యక్రమంలో ఎలాంటి సీన్ నెలకొందో చూస్తే.. వైరస్ ముప్పు జగన్ కు ఎంత దగ్గరగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

సీఎం జగన్ చుట్టూ ఏడుగురు ఉండటం.. మంత్రి కన్నబాబు అయితే మరింత దగ్గరగా ఉండటం కనిపిస్తుంది. ఇంత దగ్గరగా ఉన్న ఎవరూ ముఖానికి మాస్కు పెట్టుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు.. ఎవరూ మాస్కులు ధరించకపోవటం సరికాదంటున్నారు. చూస్తూ.. చూస్తూ కరోనా వైరస్ తో ఆటలు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న ప్రజానాయకుడు.. ప్రజల గురించి అనుక్షణం తపించటం ఓకే. ఇంత చేస్తున్న తనకు ఏమీ కాదన్న కాన్ఫిడెన్స్ ఏ మాత్రం సరికాదు. కోట్లాది మందికి మేలు చేయాలంటే.. తన వరకు తాను ఆరోగ్యంగా ఉండాలన్న వాస్తవాన్ని జగన్ త్వరగా గుర్తిస్తే మంచిది.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content