మాజీ మంత్రి సినియర్ నేత, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టేసినట్లేనా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆనం ఎక్కడా కనబడలేదు. మంగళవారం ప్రచారం కూడా ముగిసిపోయింది. అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కానీ లేదా విడిగా కూడా ఆనం ప్రచారం చేసినట్లు కనబడలేదు.
ఉప ఎన్నికలో ప్రచారం కోసం కొందరు మంత్రులు, మరికొందరు మాజీలు, ఎంఎల్ఏలకు బాధ్యతలు అప్పగించిన జగన్ మాజీమంత్రికి మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఎప్పటినుండో ఆనంకు పార్టీకి మధ్య గ్యాప్ బాగా వచ్చేయటమే. మూడేళ్ళ నుంచి జగన్ పై ఆనం బాగా అసంతృప్తిగా ఉన్నారు. కారణం ఏమిటంటే తన సీనియారిటీని గుర్తించి మంత్రి పదవి ఇవ్వలేదట.
మంత్రిపదవి ఇవ్వకపోవటమే కాకుండా జిల్లాలోని ఎంఎల్ఏలు, నేతలు తన సీనియారిటీకి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని బాగా అలిగారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలాసార్లు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు, విమర్శలు చేశారు. దాంతో ఎంఎల్ఏకి జగన్ కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. మధ్యలో అక్కడక్కడ గ్యాప్ సర్దుబాటు చేసుకునే అవకాశం వచ్చింది కానీ పెద్దగా ఫలితం కనబడలేదు.
ఇదే సమయంలో ఆనం కూతురు కైవల్య రెడ్డి ఆత్మకూరులో టీడీపీ తరపున పోటీచేస్తానని లోకేష్ ని అడిగినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి అనేక కారణాలతో ఆనంకు ఉప ఎన్నికలో ప్రచార బాధ్యతలు కూడా అప్పగించలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గతంలో ఆనం ఇక్కడినుండి ఎంఎల్ఏగా పోటీ చేశారు. గట్టి మద్దతుదారులే ఉన్నప్పటికీ జగన్ మాత్రం ఆనంను పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో అసలు ఆనంకు టికెట్ దక్కుతుందా అనేది కూడా సందేహమే అంటున్నారు. ఎందుకంటే మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కొడుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి యాక్టివ్ గా తిరుగుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates