మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం హఠాత్తుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కూటమిలోని కీలక భాగస్వామి శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ శిందే నాయకత్వంపై తిరుగుబాటు లేవదీయటంతో సంక్షోభం తప్పలేదు. తన మద్దతుదారులతో కలిసి శిందే సూరత్ లోని ఒక హోటల్లో క్యాంపు పెట్టారు. దాంతో శివసేనలో ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ? ఎప్పుడు కూలిపోతుందో ? అనే టెన్షన్ మొదలైపోయింది.
నిజానికి ఇంత హఠాత్తుగా ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తటానికి అవకాశమే లేదు. అయినా ఎందుకీ పరిస్ధితి వచ్చిందంటే శాసనమండలి ఫలితాల్లోనే భీజం పడిందని చెప్పాలి. ఫలితాలను అధికార కూటమి లైటుగా తీసుకుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈమధ్యనే ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో అధికార కూటమి తరపున పోటీచేసిన ఆరుగురు అభ్యర్ధులూ గెలవాల్సుండగా ఒకరు ఓడిపోయారు. సంఖ్యా బలం లో స్పష్టమైన విజయం సాధించాల్సిన అభ్యర్ధి ఒకరు ఓడిపోయారంటేనే క్రాస్ ఓటింగ్ జరిగిందని అర్ధమైపోతోంది.
ఇదే సమయంలో నలుగురిని మాత్రమే గెలిపించుకోగలిగిన బలమున్న బీజేపీ ఐదుగురిని పోటీలోకి దింపి అందరినీ గెలిపించుకున్నది. దీంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికార కూటమి లో చీలిక తెచ్చిందని తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన మూడో రోజే హఠాత్తుగా శివసేనలో తిరుగుబాటు మొదలైందంటే దీనివెనుక కచ్చితంగా బీజేపీనే ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కూటమి పార్టీ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నాలు చేసిందని చేసిన వ్యాఖ్యలు గమనార్హం.
అధికార కూటమిలో చీలికలు తేవటం, అధికారపార్టీలోని ఎంఎల్ఏలను లోబరుచుకోవటం ప్రభుత్వాలను కూల్చటమే బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నది. ఇలాగే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో బలంగా ఉండటమనే అడ్వాంటేజీతో బీజేపీ రాష్ట్రాల్లో రెచ్చిపోతోంది. ఇపుడు మహారాష్ట్రలో సంక్షోభం కూడా బీజేపీ పుణ్యమనే అనుకోవాల్సుంటుంది. కర్నాటకలో ఇలాగే అధికారంలోకి వచ్చింది. తర్వాత మధ్యప్రదేశ్ లో ఇదే పద్దతిలో అధికారం చేజిక్కించుకుంది. రాజస్ధాన్ లో ప్రయత్నించింది కానీ సాధ్యంకాలేదు. ఇపుడు మహారాష్ట్రలో మొదలుపెట్టింది.