టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 70+ కానీ, ఆయన మాత్రం 20+ మాదిరిగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు సవాళ్లు రువ్వుతున్నారు. గతంలో కూడా లేని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇది మంచి పరిణామమే. చంద్రబాబుపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేదే. అయితే.. చంద్రబాబు ఒకవైపే చూస్తున్నారనేది విశ్లేషకుల మాట. తాను మాత్రమే నడిస్తే.. పార్టీలో జోష్ పెరగదని అంటున్నారు. తను ఎంచుకున్న లక్ష్యాన్ని మరింత బలంగా ముందు నాయకుల్లో తీసుకురావాలని అంటున్నారు.
“2019 ఎన్నికల సమయంలోనూ.. చంద్రబాబు వన్ మ్యాన్ షో చేశారు. అప్పట్లోనూ..తనే అన్నీ అయి ప్రచారం చేశారు. నిజానికి చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఏమీలేదు. ఆయన పట్ల ఇప్పటికీ .. విజన్ ఉన్న నాయకుడిగా ప్రజల్లో మంచి పేరుంది. ఆయనకు అధికారం ఇవ్వాలనే అనుకుంటున్నారు. కానీ, ఎటొచ్చీ.. క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితిపైనే చర్చ సాగుతోంది. వైసీపీ మాదిరిగా.. టీడీపీ వ్యక్తిగత రాజకీయాలు చేసేందుకు అవకాశం లేదు” అని విశ్లేషకులు చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ రాజకీయం వ్యక్తిని బట్టి నడిచింది. కేవలం జగన్‌ను చూసి ప్రజలు ఓట్లేశారు. ఆయనను నమ్మారు. నాయకులు ఎవరు బరిలో ఉన్నారనేది చూడకుండానే.. జగన్‌ను చూసి ఓటేశారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జగనే స్వయంగా.. మీరు బలపడండి.. మీరే పార్టీని గెలిపించాలి.. అని నాయకులకు చెబుతున్నారు. అంటే.. క్షేత్రస్థాయిలో నాయకులు బలం పుంజుకోవాలనేది జగన్ చెబుతున్న మాట. ఇదే విషయాన్ని టీడీపీలో చెప్పాలనేది విశ్లేషకుల మాట.
చంద్రబాబుపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అయితే.. క్షేత్రస్థాయిలో ప్రజలతో కనెక్ట్ అయ్యే నాయకులు కావాలని.. గత ఎన్నికలను తీసుకుంటే.. ఒకటి రెండు తప్ప.. 23 నియోజకవర్గాల్లోనూ.. ప్రజలతో కనెక్ట్ అయిన నాయకులకే ప్రజలు పట్టం కట్టారని అంటున్నారు. ఇదే తరహా వ్యూహాలు అనుసరించాలి .. తప్ప.. కేవలం తను ప్రచారం చేసుకుని వెళ్లిపోయి.. ఓట్లు వేయాలని అంటే.. సాధ్యమేనా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే.. చంద్రబాబు ఒక్కరే కాకుండా.. నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.