వైసీపీ ప్రభుత్వంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో కేసులు వేస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘు రామ కృష్ణం రాజుకు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో, అప్పులు, సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చుల విషయంలో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పేసింది. ప్రభుత్వం ఎక్కడినుండి అప్పులు తెస్తున్నా హైకోర్టుకు అవసరం లేదని, అప్పులు తెచ్చుకునే ప్రభుత్వం, ఇచ్చే సంన్ధలకు సంబంధించిన విషయమని గుర్తుచేసింది.
ఎంపీ దాఖలు చేసిన పిటీషన్లు ప్రజాహితమే లేదని కూడా స్పష్టంగా చెప్పేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వం ఖజానాకు కాకుండా ప్రత్యేక బేవరేజస్ కార్పొరేషన్ కు మళ్ళించిందట. కార్పొరేషన్ కు వస్తున్న ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు తీసుకుంటోందని రఘురాజు అభ్యంతరం లేవనెత్తారు. ఇదే విషయాన్ని తన ప్రజాహిత వ్యాజ్యంలో చెప్పారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఈ వ్యాజ్యంలో అసలు ప్రజాహితమే లేదని తేల్చేసింది.
ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునేది లేదని చెబుతూనే అసలు జోక్యం చేసుకునే అధికారం ఎంపీకి కూడా లేదని తేల్చేసింది. ఇపుడు ప్రజాహితం పేరుతో వేసిన పిటిషన్ను ప్రోత్సహిస్తే రేపు కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్ల విషయంలో కూడా జోక్యం చేసుకుంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని హైకోర్టులు నడపటం లేదని ఇపుడు గనుక తాము జోక్యం చేసుకుంటే సంక్షేమ పథకాలు ప్రభావితం అవుతాయని చెప్పింది. ప్రభుత్వం ఏరూపంలో అప్పులు తెచ్చినా, ఆదాయాన్ని పొందుతున్నా వాటిని సంక్షేమ పథకాల అమలుకే ఖర్చుపెడుతున్నట్లు ధర్మాసనం చెప్పింది.
పిటీషన్ దాఖలుచేసిన ఎంపీ ఉద్దేశ్యం ప్రకారం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు ఆగిపోవాలన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తంచేసింది. ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ సక్రమంగా ఉందా లేదా అన్నది చూసుకోవాల్సింది కాగ్, ఆర్బీఐ మాత్రమే అని స్పష్టంచేసింది. సరే కోర్టు తీర్పు తర్వాత ఎంపీ మాట్లాడుతు ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని హైకోర్టు చెప్పటం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను ప్రజల కోసమే పిటీషన్ వేశానుకానీ తన వ్యక్తిగతం ఏమీలేదన్నారు. హైకోర్టు కొట్టేసిన తన పిటీషన్ను సుప్రింకోర్టులో చాలెంజ్ చేస్తానని ఎంపీ ప్రకటించటం గమనార్హం.