మోడిలో టెన్షన్ మొదలైందా ?

నరేంద్రమోడిలో టెన్షన్ మొదలైనట్లే కనిపిస్తోంది. లేకపోతే గడచిన ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని అనుకోని మోడి ఒక్కసారిగా ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నారంటే టెన్షన్ మొదలైనట్లే అనుకోవాలి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే సమయంలో వరుణ్ గాంధి లాంటి సొంతపార్టీ ఎంపీలే ఉద్యోగాల భర్తీ విషయంలో మోడీని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

రెండురోజుల క్రితమే కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను, వాటి బడ్జెట్ వివరాలను వరుణ్ బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ లెక్కల ప్రకారమే భర్తీకి నోచుకోని ఖాళీలు సుమారు 60 లక్షలున్నాయి. ట్విట్టర్ వేదికగా ఎంపీ ఖాళీల భర్తీని చెప్పి ఉద్యోగాలు ఎప్పుడిస్తారంటు మోడీని నిలదీశారు. దానికి జవాబుగానే అన్నట్లు మోడీ అర్జంటుగా మీటింగ్ పెట్టి ఖాళీల్లో కొన్నింటిని భర్తీచేయాలని ఆదేశించారు. మోడీ ఆదేశాల ప్రకారం రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగులు భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

2014 ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత హామీని తుంగలో తొక్కేశారు. ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీగురించి అసలు పట్టించుకోనేలేదు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా ఉద్యోగాల భర్తీ అన్నారంటే రాబోయే ఎన్నికల విషయంలో పెరిగిపోతున్న టెన్షన్ కారణమనే అనుకోవాలి. రైల్వేలో 3 లక్షలు, రక్షణశాఖలో 2.47 లక్షలు, హోంశాఖలో 1.29 లక్షలు, పోస్టల్ శాఖలో 90 వేలు, రెవిన్యూలో 76 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించాయి.

ఇపుడు ప్రకటించింది కేవలం 5 శాఖలు మాత్రమే. ఇంకా 72 శాఖలు, విభాగాల్లో భర్తీకి రెడీగా ఉన్న ఖాళీలను ప్రకటించాల్సుంది. పెరిగిపోతున్న నిరుద్యోగం విషయంలో ప్రతిపక్షాల ఎంపీలు పార్లమెంటులోను, బయట కూడా పదే పదే ప్రస్తావించినా మోడీ ఏనాడూ పట్టించుకోలేదు. కారణాలు ఏవైనా ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీకి మోడీ రెడీ అవ్వటం నిరుద్యోగులకు శుభపరిణామమనే అనుకోవాలి.