ఉమ్మడి కృష్నాజిల్లా గన్నవరం రాజకీయాలు మరింత ముదిరాయి. బ్రోకర్లు పిచ్చిపిచ్చిగా వాగితే వల్లకాటికి పంపుతానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్ములూరులో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పెట్టిన భిక్షతో గోసుల శివభరత్‌రెడ్డి భార్య, డాక్టర్ దుట్టా రామచంద్రరావు కుమార్తె సీతామహాలక్ష్మి జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గుర్తుంచుకోవాలన్నారు.
తన ఆత్మాభిమానం దెబ్బతినేలా ఆరోపణలు చేస్తున్న శివభరత్‌రెడ్డికి త్వరలోనే వంశీ అంటే ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సీఎం జగన్ తనకు చెప్పారని, తన అభ్యర్థిత్వం ఆయన చేతిలో ఉందని, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తనతో కలిసి పనిచేయకపోయినా నష్టమేమీ లేదన్నారు. సంస్థాగత ఎన్నికల్లో 40 చోట్ల పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టిన ఘనత వారిదని, కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అస్త్రసన్యాసం చేస్తామని మంగమ్మ శపథం చేసిన డాక్టర్ దుట్టా ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.
గన్నవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలపై విచారణ చేయించాలని కలెక్టరుకు తానే లేఖ రాశానని, రూ.2 కోట్ల మేర అపరాధ రుసుం విధించిన అధికారులు ఎందుకు వసూలు చేయట్లేదో త్వరలోనే తెలుసుకుంటానన్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసే బ్రోకర్లు ఎదురుగా వచ్చిమాట్లాడితే వల్లకాటికి పంపిస్తానని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటూరి విజయభాస్కర్, పీఏసీఏస్ అధ్యక్షుడు యర్రంశెట్టి రామాంజనేయులు, కొల్లి చిట్టిబాబు, రాష్ట్ర నాటక రంగ డైరెక్టర్ నక్కా గాంధీ, చిన్నాల గణేశ్, మండల కన్వీనర్ అవిర్నేని శేషగిరిరావు,చెరుకూరి శ్రీనివాస్, సరిపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి వంశీ వ్యాఖ్యలపై దుట్టా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.