రేవంత్ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ కు ఊపు లేదా..? ఇతర సీనియర్లపై శ్రేణులకు నమ్మకం లేదా..? వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించేంది.. ముంచేది ఆయనేనా..? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పార్టీకి రేవంతే ఆశాదీపంలా కనిపిస్తున్నారని.. టీఆర్ఎస్, బీజేపీలను ఢీకొని అధికారంలోకి రావాలంటే ఆయన వల్లే సాధ్యమనే ధీమాతో పార్టీ నేతలు కనిపిస్తున్నారు.
టీడీపీ నుంచి కాంగ్రెసులోకి రేవంత్ వచ్చినపుడే చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఆయనను పార్టీలోకి తీసుకుంటే చెడ్డ పేరు వస్తుందని అధిష్ఠానాన్ని హెచ్చరించారు. అయినా ఏఐసీసీ పాత నేతలతో కావడం లేదని కొత్త రక్తాన్ని ఎక్కించింది. ఫైర్‌బ్రాండ్ రేవంత్ తనతో పాటు టీడీపీలో కీలకంగా ఉన్న దాదాపు 50 మంది నేతలతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెసులో చేరారు.
పార్టీలో చేరిన తనను సరిగా వాడుకోవడం లేదని కొన్నాళ్లు రేవంత్ స్తబ్దుగా ఉన్నారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో రెచ్చిపోయారు. దూకుడుతో పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఉత్తమ్ కు దీటుగా నిలబడ్డారు. అయినా 2018 ఎన్నికల్లో తనతో పాటు కాంగ్రెసులో చేరిన వారికి ఆరు సీట్లు మాత్రమే సర్దుబాటు చేశారు. అయినా రేవంత్ కుంగిపోలేదు. సమయం కోసం వేచి చూశారు.
ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి.. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కారెక్కడంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. దీంతో అధిష్ఠానం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఎన్నో సంప్రదింపుల తర్వాత రేవంతును చీఫ్‌గా నియమించింది. రేవంత్ పదవి చేపట్టగానే సీనియర్లను, అసంతృప్తులను కలిసి మచ్చిక చేసుకున్నారు. అయినా అప్పుడప్పుడు కొందరు రేవంతుపై గళమెత్తుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే.. రేవంత్ లేని లోటు తెలిసొచ్చిందని.. మిగతా సీనియర్లతో పని కావడం లేదని నేతలకు స్పష్టం అయింది. రేవంత్ అమెరికా పర్యటన వెళ్లిన ఈ ఇరవై రోజుల్లో పార్టీ రాష్ట్రంలో చాలా కార్యక్రమాలనే చేపట్టింది. భట్టి ఆధ్వర్యంలో చింతన్ శిబిర్ తీర్మానాలపై సమావేశాలు.., రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడే లేకపోవడంతో ఇవి చప్పగా సాగాయి. శ్రేణుల్లో ఉత్సాహం కొరవడింది.
పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నా.. రేవంత్ లేని సమయంలో రాష్ట్రంలో కీలక సంఘటనలు జరిగాయి. వరంగల్ లో రైతుల భూసేకరణ ఉద్యమం.., జూబ్లీహిల్స్ బాలికపై సామూహిక అత్యాచారం.., పలు కేసుల్లో పోలీసుల దాష్టీకాలు బయటపడ్డాయి. వీటిపై నిరసనలు తెలపడంలో.. ఆందోళనలు నిర్వహించడంలో బీజేపీ ముందుంది. ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అయిపు లేదు.
పార్టీ సీనియర్లు ఈ అంశాలపై కొట్లాడంలో వెనుకపడ్డారు. పార్టీలో ఉద్దండులు ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు. ద్వితీయ శ్రేణి నేతలే అక్కడక్కడా ఆందోళన కార్యక్రమాలు చేశారు. అయినా బీజేపీకి వచ్చిన మైలేజీ కాంగ్రెసుకు రాలేదు. దీనికి కారణం ఆ నేతల తీరే. రేవంత్ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండకపోయేదని.. ఆయన లేని లోటు స్పష్టంగా తెలిసొచ్చిందని.. కాంగ్రెస్ నావను తీరానికి చేర్చే బాధ్యత ఇక ఆయనేదనని నేతలు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో..!