సోముకు సానుభూతి ఏదీ? నాయ‌క‌త్వానికి ప‌రీక్షే!

బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు పెద్ద క‌ష్టం వ‌చ్చింది. పార్టీలో ఆయ‌న నాయ‌క‌త్వాన్ని పెద్ద‌గా ఎవ‌రూ ప ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. ఆయ‌న ఎప్పుడు ఏ వ్యూహంతో ముందుకు సాగుతారో తెలియ‌ని ప‌రిస్థితి. అదేస‌మ‌యంలో ఎప్పుడు.. ఏం చెబుతారో.. ఏం చేస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. అందుకే.. సోముతో క‌లిసి ముందుకు న‌డిచేందుకు నాయ‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు. కాపు నాయకుడే అయిన‌ప్ప‌టికీ.. కాపుల‌ను పార్టీ వైపు మ‌ళ్లించ‌లేక పోయారు.

మేధావే అయిన‌ప్ప‌టికీ.. మేధావుల‌ను పార్టీకి చేరువ చేయ‌లేక పోయారు. ఇక‌, ఆర్ ఎస్ ఎస్ వాదిగా ఉన్నప్పటికీ.. హిందువుల ఓట్ల‌ను కూడా బీజేపీకి చేరువ చేయ‌లేక పోయారు. వీట‌న్నింటికీ కార‌ణం.. సోము అనుసరించే లోప‌భూయిష్ట‌మైన విధాన‌మేన‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న బీజేపీ.. జ‌న‌సేన‌ను ప‌ట్టించుకుని.. అంతో ఇంతో ప్రాధాన్యం ఇస్తుంద‌ని.. అనుకున్నారు. కానీ, బీజేపీ ఎక్క‌డా జ‌న‌సేన‌ను ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు.

పైగా.. ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. ఏపీకి వ‌చ్చిన సంద‌ర్భంలో జ‌న‌సేన నాయ‌కులు కొంద‌రు.. ఆయ‌న‌ను క‌లిసి.. రాష్ట్రంలో క‌లిసి ముందుకు వెళ్లే విధానంపై చ‌ర్చించాల‌ని అనుకున్నారు. కానీ, సోము వీర్రాజు ఈ భేటీని అడ్డుకున్నార‌ని.. జ‌న‌సేన నాయ‌కుల‌ను న‌డ్డాకు దూరంగా ఉంచార‌ని.. బీజేపీలో జ‌న‌సేన పొత్తును ఇష్ట‌ప‌డుతున్న నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఇలా అయితే.. పార్టీ ఏం బాగుప‌డుతుంద‌ని.. వారు ప్ర‌శ్నించారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే సోము అంటే..పార్టీలో న‌నేత‌ల‌కు పెద్ద‌గా ఇష్టం ఉండ‌డం లేద‌ని అంటున్నారు. తాజాగా సోము వీర్రాజుపై ఏపీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసుల‌ను ఆయ‌న కొట్టార‌ని.. ప‌రుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని.. పోలీసులు పేర్కొన్నారు. నిజానికి ఇలాంటి ప‌రిణామాలు వ‌చ్చిన‌ప్పుడు.. నాయ‌కులు మ‌ద్దతుగా వ్య‌వ‌హ‌రిస్తారు. కేసుల విష‌యంలో స‌ర్కారును సైతం నిల‌దీస్తుంటారు. కానీ సోము విష‌యంలో ఏ ఒక్క‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి.. సోము ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.