ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించాలంటూ జనసేన నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటించాలని రాసిన ప్ల కార్డులను జనసేన నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా సోమవారం విజయవాడకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం రాజమండ్రి గర్జన బహిరంగ సభలో పాల్గొంటారు.
జనసేన నేతలు ఎంత ఒత్తిడి చేస్తున్నా బీజేపీ నేతలైతే ససేమిరా అంటున్నారు. ఎన్నికలు వచ్చినపుడు ఆ విషయాన్ని చూసుకుంటామని, ఇప్పటినుండే అవసరం లేదని గట్టిగా రిటార్టిస్తున్నారు. అయినా జనసేన నేతలు వదలకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఎక్కడికక్కడ నడ్డాను డిమాండ్లు చేస్తున్నారు. బహుశా మంగళవారం ఈ డిమాండ్లు మరింత ఊపందుకునే అవకాశముంది. చూస్తుంటే ఇదే విషయమై మిత్రపక్షాల మధ్య పెద్ద వివాదమే నడిచేట్లుంది.
జనసేన నేతల గోల ఇలాగుంటే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ మిత్రపక్షాల నేతలను ముఖ్యమంత్రిగా ప్రకటించటం బీజేపీలో లేదన్నారు. మరదే నిజమైతే బీహార్లో మిత్రపక్షమైన జేడీయు అధ్యక్షుడు నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎలా ప్రకటించారో అర్ధం కావటంలేదు. బహుశా ఈ విషయాన్ని సత్యకుమార్ మరచిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే బీజేపీతో పొత్తుండదన్న పద్దతిలో జనసేన నేతలు గట్టిగానే హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయాన్ని సత్యకుమార్ బ్లాక్ మెయిల్ పద్దతిగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ ట్రాపులో చంద్రబాబునాయుడు, పవన్ పడిపోయారంటు జాతీయ కార్యదర్శి ఆరోపించారు. జనసేన-బీజేపీ-టీడీపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి వైసీపీకి సంబంధం ఏమిటో సత్యకుమార్ కే తెలియాలి. మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన నేతలు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన వివాదాన్ని విచిత్రంగా వైసీపీ మీదకు నెట్టేస్తున్నారు. దీంట్లోనే సత్యకుమార్ ఆరోపణలోని డొల్లతనం బయటపడిపోతోంది. నడ్డాతో సమావేశమైన బీజేపీ కోర్ కమిటి నేతలు ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.