హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు అలాంటి ఆలోచనలే రాకుండా సంస్కరణలు తేవాలని కోరారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు.
ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు అలాంటి ఆలోచనలే రాకుండా సంస్కరణలు తేవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శంషాబాద్ పరిసరాల్లో జరిగిన దిశ హత్యాచార ఘటన మరువక ముందే, హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం తీవ్రంగా కలచివేసిందన్నారు. కారులోనే అత్యాచారానికి పాల్పడడం మాటలకు అందని దుర్మార్గమన్నారు.
బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారో, ఎంత క్షోభకు గురైఉంటారో తాను ఊహించగలనని అన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి పగవారికి సైతం రాకూడదని కోరుకునే భారతీయ సమాజం మనదని పేర్కొన్నారు. అలాంటి సమాజం నుంచి వచ్చిన మన పిల్లలు రాక్షసులుగా మారి నీచాలకు పాల్పడడం ఉపేక్షించడానికి వీలులేని ఘోరమని అన్నారు.
ఈ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా చూాడాలని కోరారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. బాధితురాలు నిలదొక్కుకొని.. సామాన్య జీవితం కొనసాగించే విధంగా చేయూతనివ్వాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ను కోరారు.