జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిలో బాగా అయోమయం పెరిగిపోతోంది. పొత్తుల విషయంలో ఏమి చేయాలో ? ఎలా ముందుకెళ్ళాలో అర్ధమవుతున్నట్లులేదు. తాజాగా చేసిన వ్యాఖ్యలే పవన్లోని అయోమయానికి ఉదాహరణగా నిలుస్తోంది. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతు జనసేన ముందు రెండే మార్గాలున్నట్లు చెప్పారు. అవేమిటంటే ఇప్పటి మిత్రపక్షం బీజేపీతో కలిసి వెళ్ళటం. రెండోదేమంటే టీడీపీని కూడా కలుపుకుని వెళ్ళటం. మూడోది జనసేన ఒంటరిగా పోటీచేయటమట.
మూడు మార్గాలే పవన్ ఎంతటి కన్ఫ్యూజన్లో ఉన్నారో చెప్పేస్తోంది. జనసేన ఒంటరిగా పోటీచేయటం, బీజేపీతో కంటిన్యు అవటం మాత్రమే పవన్ చేతిలో ఉంది. టీడీపీని కలుపుకుని వెళ్ళటం పవన్ చేతిలో లేదు. అందుకు అంగీకరించాల్సింది నరేంద్రమోడి మాత్రమే. మోడీని ఒప్పించేంత సీన్ పవన్ కు లేదు. చంద్రబాబును కూడా కలుపుకుని వెళ్ళేందుకు బహుశా తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే టీడీపీని కలుపుకుని వెళ్ళటంలో ఢిల్లీ పెద్దలను ఎలాగైనా ఒప్పిస్తాననే నమ్మకం తనకుందని ఈమధ్యనే చెప్పారు. ఇంతలోనే పై మూడు ప్రతిపాదనలు ప్రకటించారు. అందుకనే తన ప్రయత్నాలు ఫెయిలైనట్లుందా ? అనే ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వెళితే బీజేపీతో కలిసి వెళ్ళటం, లేదా ఒంటరిగా వెళ్ళటమనే ఆప్షన్లు మాత్రమే పవన్ ముందున్నాయి. పవన్ వైఖరి చూస్తుంటే బీజేపీతో కలిసి వెళ్ళాలనే ఆసక్తి ఉన్నట్లు లేదు.
అంటే టీడీపీతో బీజేపీని కలపలేక, అలాగని బీజేపీని మోయలేక మధ్యలో పవన్ ఇబ్బందిపడుతున్నట్లున్నారు. ఇక్కడొక విచిత్రం ఏమిటంటే జనసేన ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పటం. నిజంగానే జనసేనకు అంత సీన్ ఉంటే పొత్తుల విషయంలో పవన్ అసలు ప్రస్తావన చేసేవారేకాదు. ఆసక్తి ఉన్నవారు పవన్ చుట్టూ తిరుగుతుండేవారు. ఒకవైపు పొత్తులపై మాట్లాడుతునే మరోవైపు జనసేన ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని చెప్పటమే విచిత్రంగా ఉంది. జనసేన ఒంటిరిగానే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని గతంలో ఎప్పుడూ చెప్పని ప్రభుత్వం ఇపుడు కొత్త రాగం అందుకున్నారు. పాపం చివరకు ఏమవుతుందో ఏమో.