అర‌వై శాతం అసంతృప్తి నిజ‌మా జ‌గ‌న్!

ఇవాళ్టితో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్త‌వుతోంది. మ‌రో రెండేళ్లు ఆయ‌న‌కు అధికారం ఉండ‌నుంది. అటుపై ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి. ఆయ‌న అనుకున్న విధంగా పాల‌న ఉందా లేదా అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు తేల్చలేం కానీ కొన్ని వాస్త‌వాలు ఒప్పుకోవాలి.

ఇప్ప‌టికీ పింఛ‌ను అంద‌ని వారిని ప్ర‌భుత్వం ఎందుక‌నో గుర్తించ‌డం లేదు స‌రి క‌దా ! వాళ్లంతా తెలుగుదేశం అభిమానులు అని చెప్పి త‌ప్పించుకుని తిరుగుతోంది అన్న విమ‌ర్శ ఉంది. మొన్న‌టి వేళ బొబ్బిలిలో అటుపై క‌ర్నూలులో కాళ్లు ప‌ట్టుకుని ల‌బ్ధిదారులు వేడుకున్నా పెద్ద‌గా ఫ‌లితం లేదు.

యాభై ఇళ్ల‌కు ఓ వ‌లంటీరును ఇచ్చినా ప‌థ‌కాల అమ‌లులో ఇప్ప‌టికీ స‌క్ర‌మ‌త రాలేదు అన్న‌ది ఓ విమ‌ర్శ. దీనిపై కూడా వైసీపీ ఆలోచించాలి. ల‌క్ష కోట్ల‌కు పైగా నిధులు వెచ్చిస్తే ఓట్లెందుకు రావు అని సీఎం ప్ర‌శ్నించారు? అయితే నోట్ల మేరకు ఓట్లు అన్న‌ది కుద‌ర‌ని ప‌ని! అని చెబుతోంది టీడీపీ.

రాష్ట్రంలో అర‌వై శాతం మంది అసంతృప్తితో ఉన్నార‌ని ఓ మీడియా స‌ర్వే చెబుతోంది. పాల‌న బాలేద‌ని అంగీక‌రిస్తూ కొంద‌రు త‌మ వాద‌న వినిపిస్తుంటే, వాస్త‌వాలు తెలుసుకోకుండా అధికార ప‌క్షం ఆగ్ర‌హంతో ఊగిపోతోంద‌ని తెలుస్తోంది.

సంక్షేమం అంటే కేవ‌లం ప‌థ‌కాల పంపిణీ మాత్ర‌మే కాద‌ని త‌మకు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ఇవ్వాల‌ని సంబంధిత వ‌ర్గాలు కోరుకుంటున్నాయి. ఇప్ప‌టికీ రోడ్లు లేని గ్రామాలు చాలానే ఉన్నాయ‌ని, ముందు వాటి సంగ‌తి చూశాకే త‌మ‌ను ఓట్లు అడిగేందుకు రావాల‌ని కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా అడుగుతున్నారు. విన్న‌విస్తున్నారు కూడా!

మ‌రోవైపు సంక్షేమం తీరు ఎలా ఉన్నా చిన్న పాటి రోడ్ల మ‌ర‌మ్మ‌తులు కూడా చేప‌ట్ట‌లేని స్థితి లో తామున్నామ‌ని స‌ర్పంచ్ లు అంటున్నారు. త‌మ‌కు కేంద్రం నిబంధ‌న‌ల మేర‌కు ఇచ్చిన నిధుల‌ను ప్ర‌భుత్వం గుంజుకోవ‌డంతో ఇప్ప‌టికే తాము న్యాయ పోరాటం చేస్తున్నామ‌ని అయినా కూడా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేద‌ని అంటోంది పంచాయ‌తీ రాజ్ కు చెందిన సర్పంచ్ ల సంఘం.

ఇదే స‌మ‌యంలో ఉద్యోగులు కూడా చాలా అంటే చాలా అసంతృప్తిలో ఉన్నారు. ఉపాధి ప‌నుల‌కు నిధులు ఇవ్వ‌కుండా బిల్లులు చెల్లించ‌కుండా త‌ప్పంతా త‌మదే అన్న విధంగా గ్రామాల్లో ప్రచారం చేయ‌డం త‌గ‌ద‌ని కూడా అంటున్నారు. ఇవ‌న్నీ ఉద్యోగుల, స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల ఆరోప‌ణ‌లు. అసంతృప్త‌త‌కు కార‌ణాలు.