కోన‌సీమ క‌ల్లోలం.. ఉద్యోగుల‌కు తీర‌ని వ్య‌ధ‌!

కోనసీమ జిల్లా అమలాపురంలో.. విధ్వంసకర ఘటనల నేపథ్యంలో నిలిపేసిన ఇంటర్నెట్ సేవలు.. ఐదు రోజులైనా పునరుద్ధరించలేదు. దీంతో.. సిగ్నల్స్ లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. ఫోన్లు, లాప్ టాప్ పట్టుకొని గుట్టలు, పుట్టలు పట్టుకొని తిరుగుతున్నారు. అమలాపురంలో విధ్వంసకర ఘటనలతో అధికారులు ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఐదు రోజులైనా.. నెట్ సేవలు పునరుద్ధరించకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇంటర్నెట్ పని చేయక అన్ని రంగాల వారూ అవస్థలు పడుతున్నారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సిగ్నల్స్ కోసం లాప్టాప్, ఫోన్లు పట్టుకొని జిల్లా సరిహద్దులకు తరలిపోతున్నారు. యానాం, కాకినాడ, రాజమహేం ద్రవరం, పాలకొల్లు, భీమవరం, నర్సాపురం.. వంటి దూరప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నారు. గోదావరి ఒడ్డున కూర్చుని అతికష్టం మీద విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిజిటల్ సేవలు నిలిచి ఆర్థిక లావాదేవీలు జరగక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి.. అంతర్జాల సేవలు పునరుర్ధరించాలని..లేకపోతే ధర్నాకు దిగుతామని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హెచ్చరించారు. ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించలేదు. ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ పనుల వివరాల నమోదుకు విఘాతం కలుగుతుండగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఫోన్ డేటా సిగ్నల్ కోసం.. ప్రజలు గోదావరి తీరాలకు చేరుతూ, పశ్చిమ గోదావరి జిల్లా వైపు లంకలు దాటుతున్నారు. సిగ్నల్ అందిన చోట గుమిగూడుతున్నారు.

44 మంది అరెస్టు

అమలాపురం అల్లర్ల ఘటనలో.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి ఇప్పటికే 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరింత మందిని అరెస్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు.