మిత్రపక్షం బీజేపీ నేతలు ఒంటెత్తు పోకడలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తూ ఊరుకోవటం మినహా చేయగలిగిందేమీ లేదని అర్థమైపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మీడియా సమావేశంలో ప్రకటించేశారు. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనకు చాలాకాలం ముందే వీర్రాజు ఇలాంటి ఓ ప్రకటన చేశారు. అయితే అప్పట్లోనే జనసేన నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
ఇపుడు షెడ్యూల్ ప్రకటన వచ్చిన తర్వాత కూడా వీర్రాజు తన ప్రకటనను ఏ రకంగాను మార్చుకోలేదు. నిజానికి ఆత్మకూరులో రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్ధి పోటీచేయాలనే విషయాన్ని కూర్చుని మాట్లాడుకోవాలని జనసేన నేతలు సూచించారు. అయితే వీర్రాజు మాత్రం ఏకపక్షంగా తమ పార్టీయే పనిచేస్తుందని ప్రకటించేశారు. వీర్రాజు ప్రకటనను జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్ళినా ఆయనేమీ మాట్లాడలేకపోయారని సమాచారం.
బీజేపీ ఏకపక్ష ప్రకటనకు కారణం ఏమిటంటే బద్వేలులో కూడా ఉపఎన్నికలో జనసేన పోటీ చేయలేదు. అక్కడ ఎంఎల్ఏ చనిపోయిన కారణంగా జరిగిన ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ భార్య పోటీచేస్తున్న కారణంగా తాము పోటీ చేసే ఆలోచన చేయలేదని పవన్ ప్రకటించారు. ఇపుడు ఆ ప్రకటనను బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుని ఆత్మకూరులో కూడా పవన్ అదే ఆలోచనలో ఉంటారు కాబట్టే తాము పోటీలోకి దిగుతున్నట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.
మొత్తానికి తన ఆలోచనల గురించి బీజేపీ నేతలు ఏమి చెప్పినా తలూపటం తప్ప పవన్ చేయగలిగేదేమీ కనబడటం లేదు. అందుకనే ఆత్మకూరులో పోటీ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించినా జనసేన నుంచి ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కావటం లేదు. కారణాలు ఏవైనా బద్వేలులో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ ప్రచారం చేయలేదు. అలాగే జనసేన శ్రేణులు కూడా ప్రచారంలో పెద్దగా కనబడలేదు. మరిపుడు ఆత్మకూరులో ఏమవుతుందో చూడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలినిచ్చేదిలేదన్న తన ప్రతిజ్ఞను పవన్ ఏమేరకు నిలుపుకుంటారో చూడాలి.