ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికే: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. తొలుత ఉండవల్లిలోని నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిన బాబు.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయల్దేరిన ఆయన మార్గం మధ్యలో చిలకలూరిపేట వద్ద టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని ఈ సంద‌ర్భంగా చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. “1994లో కూడా ఇంత ఉత్సాహం లేదు. కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. పార్టీ నాయకులను వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీటన్నింటికీ భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. ఎంతో మంది సీఎంలను చూశాను. ఇలాంటి పనికిమాలిన చిల్లర ముఖ్యమంత్రిని చూడలేదు. నిన్న ఓ మంత్రి మహానాడును తాము అడ్డుకోవడం లేదని చెప్పారు. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా? ఒంగోలులో సభకు గ్రౌండ్‌ ఇవ్వరా?“ అని నిప్పులు చెరిగారు.

వైసీపీకి ఊడిగం చేసే అధికారుల భరతం పడతామ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “టీడీపీ ఫ్లెక్సీలు చించేస్తారా? నాకు కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టను. మర్యాదగా మీరుంటే నేనూ మర్యాదగా ఉంటా. పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం. మహానాడు ఓ ప్రభంజనం. ఎక్కడికక్కడ కట్టలు తెంచుకొని మహానాడుకు రండి. మీకు నేను అండగా ఉంటాను. ఈ మహానాడు ద్వారా క్విట్‌ జగన్‌.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు పిలుపిద్దాం. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. రాష్ట్రంలో ఏ వర్గమూ బాగాలేదు.“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం

చిలకలూరిపేట నుంచి బయలుదేరి యడ్లపాడు వంకాయపాడు చేరుకున్న చంద్రబాబు ర్యాలీకి పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మహానాడుకు వెళ్లే వారి కోసం వంకాయలపాడులో చేసిన ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు. ‘అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే. అమలాపురంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే తగులబెట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారు. వాళ్లే తగలబెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారు. ప్రతిపక్షాలపై తోయడం జగన్‌కు అలవాటుగా మారింది.“ అని వ్యాఖ్యానించారు..

“జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా. ఆర్టీసీ బస్సులకు డ‌బ్బులు కడతామన్నా బస్సులు ఇవ్వరా?. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను భయపెడుతున్నారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏం చెప్పాలని బస్సు యాత్ర చేపడుతున్నారు. ఎస్సీలకు చెందిన 28 పథకాలు రద్దు చేశారు. డ్రైవర్‌ను అనంతబాబు చంపేస్తే.. కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు’ అని చంద్రబాబు ధ్వజ మెత్తారు.

ప్రభుత్వం ఎన్నిఅడ్డంకులు సృష్టించినా.. కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, మహానాడు దిగ్విజయం అవుతుందని పార్టీ నేతలు అన్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. అధినేత చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. వందల సంఖ్యలో వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరించాయి. ఇవాళ సాయంత్రం ఒంగోలులో పార్టీ పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించనున్నారు.