మ‌హానాడు టైమ్ : జెండాలు పీకేస్తే ఏమౌతుంది జ‌గ‌న్ ?

తెలుగుదేశం పార్టీ పండుగ మ‌హానాడుకు ఒంగోలు వేదికౌతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తయ్యాయి అని తెలుస్తోంది. ఈ నెల 27,28 తేదీల్లో జ‌రగ‌బోయే మ‌హానాడుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వెళ్ల‌నున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగుంది కానీ ఒంగోలు ప‌ట్ట‌ణంలో ప‌సుపు పండ‌గ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ జెండాల‌ను (ప్లాస్టిక్ జెండాల‌ను) మున్సిపాల్టీ అధికారులు తొల‌గించ‌డం అన్న‌ది పెద్ద వివాదంగా న‌మోదై ఉంది.

ప్ర‌జా స్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా మీటింగులు పెట్టుకునే స్వేచ్ఛ ఉన్న‌ప్పుడు ఏ విధంగా వీటిని తొల‌గిస్తార‌ని టీడీపీ  అడుగుతోంది. రాజ్యంలో అన్ని పార్టీల‌కూ స‌మాన హ‌క్కులున్న‌ప్పుడు ఏకప‌క్షంగా జెండాల తొల‌గింపు అన్న‌ది భావ్యం కాద‌ని, ఇటువంటి ఒంటెద్దు పోక‌డ‌ల‌ను మానుకోవాల‌ని టీడీపీ హిత‌వు చెబుతోంది.

ఇక జెండాలే కాదు ఫ్లెక్సీల‌ను కూడా తొల‌గించేందుకు ఒంగోలు మున్సిపాల్టీ అధికారులు అతి చేసే అవ‌కాశాలున్నాయ‌ని టీడీపీ ఆరోపిస్తోంది. తాము క‌నుక ఆరోజు  స‌హ‌క‌రించ‌కుంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చేసేవారా అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ. అయితే వీటిపై ఇంత‌వ‌ర‌కూ వైసీపీ వ‌ర్గాలు స్పందించ‌డం లేదు.

గ‌తంలోఇలాంటి వివాదాలే నెల్లూరు కేంద్రంగా సొంత పార్టీకి సంబంధించే వ‌చ్చిన‌ప్పుడు మాజీ మంత్రి అనిల్ తెలివిగా స్పందించారు. నా ఫ్లెక్సీలు అనే కాదు ఎవ్వ‌రి ఫ్లెక్సీలు నిబంధ‌న‌లకు విరుద్ధంగా ఉండేందుకు వీల్లేద‌ని ఆ రోజు తాము ఒక నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అంటున్నారు.

తెలుగుదేశం జెండాలు తొల‌గించారు స‌రే మ‌రి ! శ్రీ‌కాకుళం న‌గ‌రంలో రేపటి వేళ ప్రారంభం కానున్న మంత్రుల బ‌స్సు యాత్ర‌కు సంబంధించి వైసీపీ జెండాలు ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో క‌ట్టారే ! మ‌రి! వాటిని కూడా తొల‌గిస్తారా ? అని ప్ర‌శ్నిస్తోంది ఉత్తరాంధ్ర టీడీపీ. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రూల్ ఈజ్ రూల్ ..రూల్ ఫ‌ర్ ఆల్ అని చెప్ప‌డం కాదు పాటించాలి అని హిత‌వు చెబుతోంది.