అందుకే.. డైవ‌ర్‌ను నేనే చంపేశా.. : ఎమ్మెల్సీ అనంత‌బాబు

ఏపీ అధికార‌పార్టీని కుదిపేసిన‌.. ఎమ్మెల్సీ అనంత ఉద‌య భాస్క‌ర్ మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే హ‌త్య చేశాన‌ని.. అనంత‌బాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు విచారణలో తెలిపారు. సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు తెలిపారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఏపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ విచారణ కొనసాగుతోంది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన్ను ప్రత్యేక పోలీసు బృందా లు గాలించి పట్టుకున్నాయి. మరికాసేపట్లో ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంత..ఈ నెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి 12 న్నర గంటలకు ఉదయభాస్కర్‌ ఫోన్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి …నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు.

సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారినీ అక్కడికి రమ్మని పిలిచాడు. మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చారు.

సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు. పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి.

అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. అనంత‌రం పోస్టు మార్ట‌మ్‌లో హ‌త్యేన‌ని తేలింది. దీంతో ఎమ్మెల్సీ పైనే అనుమానాలు పెరిగాయి. తాజాగా ఆయ‌న.. త‌నేచంపేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రి ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఏం చెబుతారో చూడాలి. ఇదిలావుంటే..మ‌రోవైపు ఎమ్మెల్సీ చెబుతున్న ఆ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు ఏంట‌నేది కూడా తేల్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇదే జ‌రిగితే.. ఒక ఎమ్మెల్యే, మ‌రో మాజీ ఎమ్మెల్యే కూడా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.