తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోపాన్ని భరించటం చాలా కష్టం. ఆయన ఒకసారి ఆగ్రహించటం మొదలు పెడితే..దాన్ని అక్కడితో ఆపరు. ఆయన ఆ పనిని నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన అనుగ్రహం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. ఆగ్రహం అంతటి వేదనకు కారణమవుతుంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారంగా మారటం.. కాలం ఆయనకు అనుకూలంగా ఉండటంతో ఆయనేం చేసినా.. ఆయనకు మేలు చేస్తుంటే.. ఆయన ప్రత్యర్థులకు మాత్రం ఇక్కట్లను తెచ్చి పెడుతోంది. కొంతకాలంగా కేంద్రంలో ఏర్పడిన పంచాయితీతో దూరం పెరగటం తెలిసిందే.
దీంతో.. మోడీ సర్కారు మీదా.. ప్రధాని మోడీ మీదా సీఎం కేసీఆర్ కస్సుమంటున్నారు. ఇదొక్క కేసీఆర్ తో ఆగకుండా.. ఆ బాధ్యతను తన రాజకీయ వారసుడు.. మంత్రి కేటీఆర్ కు అప్పజెప్పటం తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా కేంద్రం మీదా.. ప్రధాని నరేంద్ర మోడీ మీదా ఆయన ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ టూర్ తో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు సీఎం కేసీఆర్ కార్యాచరణను సిద్ధం చేసుకోవటం.. శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లటం తెలిసిందే.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇంతకాలం వెళ్లని ఆయన.. ఇప్పుడే ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర వాదన వినిపిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్ లోని ఐఎస్ బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ద్విశతాబ్ది కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. సాధారణంగా దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే.. సీఎం స్వాగతించటం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రావటం.. ఆ సమయంలో ఆయన దూరంగా ఉండటం తెలిసిందే.
అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు సైతం సీఎం హోదాలో కేసీఆర్ హాజరు కాకుండా.. తన తరఫున ఎవరో ఒక మంత్రిని.. అధికారిక టీంలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోడీ వస్తున్న వేళ.. ఆయన హాజరయ్యే కార్యక్రమానికి హాజరు కావటంతో పాటు.. ఆయనకు స్వాగతం పలకటం ఇష్టం లేకనే.. సీఎం కేసీఆర్ తన తాజా షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని కొన్ని నెలల నుంచి వాదనలు వినిపిస్తున్న ఆయన.. దాని కార్యాచరణకు హటాత్తుగా ముహుర్తం డిసైడ్ చేసి.. ఢిల్లీకి పయనం కావటం వెనుక రాష్ట్రానికి మోడీ వస్తుండటమే ప్రధాన కారణమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ వస్తుంటే.. అంతకు కొద్ది రోజుల ముందే ఢిల్లీకి వెళుతున్న సీఎం కేసీఆర్.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరై ఢిల్లీకి వెళ్లిన తర్వాతి రోజున సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తిరిగి రానుండటం గమనార్హం.