జగన్ డైలాగ్‌తో జనసేన ట్రోలింగ్

నన్ను ఎవరికో దత్తపుత్రుడు అంటే.. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక జారీ చేసినా.. అటు నుంచి మార్పేమీ లేదు. తాజాగా ఓ మీటింగ్‌లో మరోసారి పవన్‌ను దత్తపుత్రుడు అనే సంబోధించాడు జగన్. అంతే కాక కౌలు రైతుల పరామర్శ, ఆర్థిక సాయం కోసం పర్యటిస్తున్న జనసేనాని మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలే చేశాడు.

ఈ పర్యటనల్లో ఆత్మహత్య చేసుకున్నా పరిహారం అందని ఒక్క రైతును కూడా పవన్ చూపించలేకపోయాడని తేల్చేశారు జగన్. కానీ జగన్ మాటల్లో వాస్తవం లేదని అందరికీ తెలుసు. పవన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో హడావుడిగా ఒకరిద్దరికి పరిహారం అందేలా చూడడం, పవన్ కలవాలనుకుంటున్న కుటుంబాలను బెదిరించడం, లేదా మీకు సాయం అందబోతోందని ఊరించడం లాంటివి అధికారులు చేస్తుండటం మీడియాలో కనిపిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే.. జగన్ అన్న మాటనే పట్టుకుని ఇప్పుడు జనసేన ఓ మీడియా ఛానెల్ సహకారంతో మంచి పంచ్ వీడియో రెడీ చేసింది. సాయం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారు అన్న మాటను రిపీట్ చేస్తూ.. పవన్ ద్వారా సాయం అందుకున్న ఒక్కో రైతు కుటుంబంతో మాట్లాడించారు. కౌలు రైతు అయిన తమ కుటుంబ పెద్ద ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది వివరిస్తూ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ధ్రువీకరిస్తూ.. అలాగే తమను కష్టంలో ఆదుకున్న పవన్‌కు ధన్యవాదాలు చెప్పుకున్నాయి ఆ కుటుంబాలు.

ముందు జగన్ డైలాగ్ చూపించడం.. వెంటనే బాధితుల వాయిస్ వినిపించడం.. ఇలా ఏపీ సీఎం, ప్రభుత్వ తీరును ఎండగట్టేలా వీడియో తయారు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది జనసేన పార్టీ అధికారిక హ్యాండిల్. చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తున్న ఇలాంటి వీడియోలే అధికార పార్టీని ఎదుర్కోవడానికి సరైన మార్గం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఇలాంటి వాటిని పాపులర్ చేయకుండా.. ఫ్యాన్ వార్స్, సినిమా గొడవల కోసమే పవన్ అభిమానులు ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తుండటమే విచారకరం.