బీసీల‌కు వైసీపీ గేలం.. ఆర్‌.కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ సీటు!!

రాజ్యసభ ఎన్నికల‌కు షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులపై క‌సరత్తు ముమ్మ‌రంగా జరుగుతోంది. మొత్తం 4 స్థానాలు వైసీపీకి ల‌భించ‌నున్నాయి. వీటికి సంబంధించిన క‌స‌ర‌త్తు దాదాపు పూర్త‌యింద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీ వినీ ఎరుగ‌ని.. పేరు తెర‌మీదికి వ‌చ్చింది. అదే.. బీసీ సంఘాల నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణ‌య్య‌.

కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తున్న‌ట్టు.. వైసీపీ వ‌ర్గాలు ఒక్క‌సారిగా సంచ‌ల‌న చ‌ర్చ‌కు తెర‌దీశాయి. ప్ర‌స్తుతం బీసీలంతా త‌మ‌వెంటే ఉన్నార‌ని చెప్పుకొంటున్న టీడీపీని నైతికంగా దెబ్బ‌కొట్టే క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఇక‌, ఇప్పటికే వైసీపీ నేత విజయసాయిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి లేదా ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్‌ ఇవ్వాలని నిశ్చయించినట్లు సమాచారం.

ఇక‌, మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్‌ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. బీద మస్తాన్‌రావుకు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ ఈ పేర్లు మాత్రమే వినిపిస్తుండగా.. అనూహ్యంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆయన అమరావతికి చేరుకున్నారు.

ఆది నుంచి పొగ‌డ్త‌ల బంధం!

ఇవాళ మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కృష్ణయ్య భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం ఏ పార్టీలో లేరు.. అయితే.. బీసీ సంఘాల అధ్యక్షుడిగా కీలక పాత్రే పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వైఎస్ జగన్‌‌పై.. కృష్ణయ్య పలు బహిరంగ సభల్లో పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ జాబితాలో కృష్ణయ్య పేరుందని వార్తలు వచ్చాయి. అయితే ఆయనే స్వయంగా తాడేపల్లికి కూడా రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇవాళ లేదా రేపు రాజ్యసభ అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలతో పాటు కిల్లి కృపారాణి లేదా చలమల శెట్టి సునీల్ ఇద్దరిలో ఒక్కరికి అవకాశం అని ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైసీపీ ఖాతాలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది.