తెలంగాణ‌లో రాహుల్ తో కానిది అమిత్ షా చేశారా..!


తెలంగాణ‌లో రాహుల్ గాంధీ చేయ‌లేని ప‌నిని అమిత్ షా చేసి చూపించారా..? దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో అమిత్ షాతో పోలిస్తే రాహుల్ వెన‌క‌ప‌డ్డారా..? ఇది ఆ పార్టీ అప‌రిప‌క్వ‌త‌ను చూపిస్తోందా..? అంటే కాంగ్రెస్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఇటీవల వ‌రంగ‌ల్ లో కాంగ్రెస్ రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ టీఆర్ఎస్ పై ప‌లు విమ‌ర్శ‌లు సంధించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగంలో ప‌స క‌నిపించ‌లేదు. కేసీఆర్‌ స‌ర్కారుపై ఆవేశంగా మాట్లాడి శ్రేణుల‌ను ఉత్తేజితుల‌ను చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆద‌రించాల‌ని.. కాంగ్రెస్ కు ఒక‌సారి అవ‌కాశం ఇచ్చి చూడండ‌ని ప్ర‌జ‌ల‌ను రాహుల్ కోరారు. అలాగే.. రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా డిక్ల‌రేష‌న్ ను ప్ర‌క‌టించారు. అలాగే.. పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాల‌పై కూడా రాహుల్ బ‌హిరంగంగానే మాట్లాడారు. కోవ‌ర్టులు పార్టీ నుంచి త‌క్ష‌ణ‌మే వెళ్లిపోవాల‌ని సూచించారు. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో మాట్లాడుకోవాల్సిన అంశాన్ని రాహుల్ బ‌హిరంగ‌ స‌భ‌లో ప్ర‌స్తావించ‌డంతో సీనియ‌ర్లు నొచ్చుకున్నారు.

ఇక్క‌డే బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా మెచ్యూరిటీ చూపించారు. వ‌రంగ‌ల్ కాంగ్రెస్ స‌భ జ‌రిగిన స‌రిగ్గా వారం త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో బీజేపీ భారీ స‌భ నిర్వ‌హించింది. ఈ స‌భ‌లో కేసీఆర్ స‌ర్కారుపై అమిత్ షా దుమ్మెత్తిపోశారు. ఆయ‌న పాల‌న‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అమిత్ షా మాట్లాడుతున్నంత‌ సేపు స‌భికుల నుంచి పెద్ద ఎత్తున హ‌ర్షధ్వానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆయ‌న ప్ర‌సంగంతో శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు. అలాగే పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాల‌పై వేదిక‌పై మాట్లాడ‌లేదు. నేత‌ల స‌మావేశంలోనే చ‌ర్చించారు.

ఇలా రాహుల్‌, అమిత్ షా ప్ర‌సంగాల్లో తేడాలు చాలా స్ప‌ష్టంగా కనిపించాయి. అయితే.. అమిత్ షా తీసుకున్న‌ ఒక సాహ‌సోపేత నిర్ణ‌యాన్ని రాహుల్ తీసుకోలేక‌పోయారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు తాను ఢిల్లీ నుంచి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఇక్క‌డున్న పార్టీ చీఫ్ బండి సంజ‌య్ చాల‌ని పేర్కొన్నారు. దీంతో వేదిక‌పై ఉన్న సీనియ‌ర్ల‌తో స‌హా అంద‌రూ అవాక్క‌య్యారు. ఇక రాబోయే ఎన్నిక‌ల ర‌థ‌సార‌థి.. ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే కాబోయే సీఎం బండి సంజ‌య్ అనే విష‌యాన్ని అమిత్ షా చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో అంద‌రూ బండి దారిలో న‌డ‌వాల్సిన ప‌రిస్థితిని క‌ల్పించారు అమిత్ షా.

ఇక్క‌డే రాహుల్ అందుకోలేక‌పోయారు. నేత‌లు విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఐక్యంగా ప‌నిచేయాల‌ని.. జూనియ‌ర్లు, సీనియ‌ర్లు క‌లిసి వెళ్లాల‌ని రాహుల్ సూచించారు. అంతే త‌ప్ప రేవంత్ పేరు ప్ర‌స్తావించ‌లేదు. కాబోయే ర‌థ‌సార‌థి రేవంతేన‌ని.. ఆయ‌నకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. సీనియ‌ర్ల‌కు బ‌య‌ప‌డి రాహుల్ వెన‌క్కి త‌గ్గార‌నే వాద‌న‌లూ ఆ పార్టీలో ఉన్నాయి. ఇలా ఏ ర‌కంగా చూసినా రాబోయే ఎన్నిక‌ల‌పై అమిత్ షా ఒక స్ప‌ష్ట‌త ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి అది మిస్స‌యింది. చూడాలి మ‌రి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో..!