మ‌సీదులో శివ‌లింగం.. బీజేపీ సంబ‌రాలు!!

జ్ఞాన్వాపి మసీదు-శృగార్ గౌరీ ప్రాంగణంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను వీడియో తీశారు. ఈ సందర్భంగా మసీదు చెరువులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో అక్క‌డ మ‌రింత మంది పోలీసుల‌ను మోహ‌రించి.. చీమ కూడా వెళ్ల‌కుండా.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని.. అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఎవ‌రైనా నిర‌స‌న కారులు ఆందోళ‌న‌కుదిగితే.. ప‌టిష్ట చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేయాల‌ని సూచించింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు-శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే ప్రశాంతంగా ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు ఆదేశించగా విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను సర్వే బృందం వీడియో తీసింది.

ఈ సందర్భంగా మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై ముగ్గురు కమిషన్ సభ్యులు తయారు చేసే నివేదికను.. అడ్వకేట్‌ కమిషనర్ కోర్టులో సమర్పించనున్నట్లు ప్రభుత్వం న్యాయవాది ఒకరు తెలిపారు. జ్ఞాన్వాపి ప్రాంగణంలో శివలింగం ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశించింది.

జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు.. అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలివ్వగా ఈ ప్రక్రియ ముగిసింది. మరోవైపు.. జ్ఞాన్వాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.

బీజేపీ సంబ‌రాలు

ఇదిలావుంటే, మ‌సీదులో శివ‌లింగం ఉంద‌ని.. అది ఐదు అంగుళాల పొడ‌వు, 12 అంగుళాల పాన‌వ‌ట్టంతో ఉంద‌ని అధికారులు వెల్లడించ‌డంతో న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో బీజేపీ నేత‌లు సంబ‌రాల‌కు దిగారు. భారీ ఎత్తున బాణా సంచా కాల్చి మ‌సీదు కాదు.. శివాల‌యం అంటూ.. నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్క‌డ నుంచి పంపించేశారు.