కుప్పం నియోజకవర్గంలోని నేతలు సక్రమంగా పని చేసుంటే మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత చిత్తుగా ఓడిపోయేవారమా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రోజుల నియోజకవర్గం పర్యటనలో గుడెపల్లె మండలంలో చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోవటానికి తమ్ముళ్ళదే తప్పని తేల్చారు. కొందరు నేతలు నాయకులుగా కాకుండా వినాయకులుగా మారిపోవటమే ఘోర ఓటమికి ప్రధాన కారణంగా చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గరనుండి చంద్రబాబు రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీ ఇబ్బందులు పడకుండా మళ్ళీ బలోపేతమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నియోజవర్గంలో పర్యటనలు, నేతలతో వరుసగా సమీక్షలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తన పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి పనితీరు తదితరాలపై చంద్రబాబు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.
ఇదే సమయంలో ఏడుసార్లు నియోజకవర్గం నుంచి తనను గెలిపించి ముద్దు బిడ్డగా చూసుకున్నట్లు చెప్పారు. తాను తప్పుచేశానని, మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటానికి తనదే తప్పని అంగీకరించారు. తనవైపు తప్పులు జరిగాయి కాబట్టే తాను తలవంచుకుంటున్నట్లు చెప్పారు. తానుచేసిన తప్పును సరిదిద్దుకోవటంలో భాగంగానే తొందరలోనే కుప్పంలో ఇల్లు నిర్మించుకోబోతున్నట్లు తెలిపారు.
సొంతింటి నిర్మాణం కోసం 2 ఎకరాలు కొనుగోలు చేసిన విషయాన్ని చంద్రబాబు వివరించారు. పార్టీలోని కార్యకర్తల నుండి వస్తున్న డిమాండ్ల ప్రకారం కోవర్టులను గనుక చంద్రబాబు ఏరేయగలిగితే పార్టీ బలోపేతమవ్వటం పెద్ద కష్టమేమీ కాదనే ప్రచారముంది. మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీకి లోపాయికారీగా సహకరించిన నేతలు ఎవరో తనకు తెలుసని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయితే వారిలో ఏ ఒక్కరు మీదా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కోవర్టులను చంద్రబాబు ఎందుకు ఏరేయటం లేదనే చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి కుప్పంలో ఇల్లు కట్టుకుంటే సరిపోదని, కోవర్టులను ఏరేయాలని నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు స్పష్టంచేశారు. మరి తాజా పర్యటనలో చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates