అప్ప‌ట్లో బుద్దిలేక టీడీపీతో చేతులు క‌లిపాం: వీర్రాజు

Somu Veeraju

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన రాజ‌కీయ పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే.. టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్‌నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయ‌న్న సోము.. ఆ పార్టీల‌కు వ్య‌తిరేకంగానే తాము ప‌నిచేస్తున్నామ‌న్నారు.

ప్ర‌స్తుతం జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే.. టీడీపీ, జనసేన కలుస్తాయా? లేదా? అనేది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌నే అడగాలని చెప్పారు. ఏలూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పొత్తులపై నంద్యాల జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆ విషయం ఆయన్నే అడగాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని మ‌రోసారి స్పష్టం చేశారు.

“రాష్ట్రంలో ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే రాజ‌కీయాలు ఏవున్నాయి? ఉన్న రెండు పార్టీలు కుటుంబం కోసం ప‌నిచేస్తున్న పార్టీలే. ఆ పార్టీల నేత‌లు కుటుంబ స‌భ్యుల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వారి ప్ర‌యోజ‌నాలే.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు. ప్ర‌జ‌ల కోసం ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తున్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ కుటుంబ పార్టీల‌తో ఎలా పొత్తు పెట్టుకుంటుంది?” అని ప్ర‌శ్నించారు. మ‌రి 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారుక‌దా? అని ప్ర‌శ్నిస్తే.. “నో కామెంట్‌. అది అప్ప‌ట్లో తీసుకున్న పొర‌పాటు నిర్ణ‌యం. బుద్ధి త‌క్కువై టీడీపీతో క‌లిసాం” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం..

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని.. సోము చెప్పారు. సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీఫార్మసీ యువతి మృతిపై.. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్యారా విచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది తప్ప.. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న జ‌గ‌న్ ఒంటెత్తు పాల‌న‌పై.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌ని వివ‌రించారు. అదేస‌మ‌యంలో తాము కూడా రాష్ట్రంలో పోరాటాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.