వైసీపీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఖాయమేనా?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ….ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతమైన పేరు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ…జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జనసేనాని మళ్లీ సినిమాలు చేయాలన్న నిర్ణయం నచ్చని లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు.

బీజేపీలో చేరేందుకు లక్ష్మీనారాయణ పావులు కదపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, గతంలో కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. తాజాగా, మరోసారి జగన్ పాలనపై లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే వైసీపీలో లక్ష్మీనారాయణ చేరబోతున్నారంటూ మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రజలను, సమాజాన్ని, దేశ ఆలోచనా విధానాన్ని మార్చే విధంగా ఏదైనా రాజకీయ పార్టీ ముందుకు వస్తే…అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని వైసీపీలో చేరికపై లక్ష్మీనారాయణ గతంలో పరోక్షంగా సమాధానమిచ్చారు. తాజాగా జగన్ పాలన బాగుందన్న జేడీ…మొదట్లో జగన్ పాలనపై అనుమానం ఉండేదని సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.

జగన్ కు రాజ్యాంగంపై మంచి పట్టు ఉందని, జగన్ సీఎం అయిన తర్వాత….గ్రామాల్లో పరిస్థితి మారిందని అన్నారు. దశలవారీ మద్య నిషేధంతో గ్రామాల్లో ఆడవాళ్లు సంతోషంగా ఉన్నారని…ఈ విషయంలో జగన్ కమిట్మెంట్ నచ్చిందని కితాబిచ్చారు. ఈ ప్రకటనలను బట్టి….జగన్ కు జేడీ జై కొడుతున్నారని, త్వరలోనే వైసీపీలో చేరతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, జగన్ ను జైలుకు పంపడంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాత్ర ఉందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, జగన్ పై కేసులు రాజకీయ కక్ష్యతో పెట్టారని, విధి నిర్వహణలో భాగంగానే తాను ఆ కేసులను విచారణ జరిపానని లక్ష్మీనారాయణ పరోక్షంగా అన్నారు. ఈ నేపథ్యంలో ఒక వేళ లక్ష్మీనారాయణ వైసీపీలోకి వస్తానంటే…జగన్ చేర్చుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

అయితే, జగన్ ను ఒక అధికారిగా ఎంత ఇబ్బంది పెట్టినా..లక్ష్మీనారాయణను పార్టీలోకి చేర్చుకోవడానికే జగన్ మొగ్గు చూపుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జేడీయే పార్టీలో చేరితే జగన్ పై కేసులు తప్పు అని జనం అనుకుంటారని తద్వారా వైసీపీ మానసికంగా బలపడుతుందన్నది వైసీపీ అధిష్టానం ఆలోచన. వైసీపీలోకి జేడీ వచ్చాడంటే జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనని వైసీపీ థింక్ ట్యాంక్ అనుకుంటోందట. మరి, ఈ ఊహాగానాల్లో వాస్తవమెంత…అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.