టీడీపీతో జ‌న‌సేన పొత్తు.. ప‌వ‌న్ డైరెక్ట్ కామెంట్ ఇదే!

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో ఎవరెవరు కలిసి వస్తారో ఇప్పటికీ తెలియదన్నారు. ఇవాళ్టికీ తమకు బీజేపీతోనే పొత్తు ఉందన్న పవన్.. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని సూచించారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. నంద్యాల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన పవన్.. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని.., పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని అన్నారు. ఇవాళ్టికీ తమకు బీజేపీతోనే పొత్తు ఉందని.., ఏపీ పరిస్థితిని తమ మిత్రపక్షం బీజేపీ నాయకత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పొత్తుకోసం టీడీపీ ఆహ్వానిస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు.. రాష్ట్ర భవిష్యత్, ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

“రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా తీసుకెళ్తాం. ఎవరెవరు కలిసి వస్తారో నాకు ఇప్పటికీ తెలియదు. ప్రత్యామ్నాయం అనేది బలమైన శక్తిగా ఉండాలి. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం. ఈ ప్రభుత్వ విధానాల వల్లే వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పా. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలి. రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, ఎవరికీ రక్షణ లేదు. సరైన సమయంలో వ్యూహాలు, రోడ్‌మ్యాప్‌ల గురించి చెబుతాం” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

నంద్యాల జిల్లా శిరువెళ్లలో నిర్వహించిన రచ్చబండలో.. పవన్ మాట్లాడుతూ.. కౌలురైతుల కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు సాయం చెయ్యరు.. తమను చెయ్యనివ్వరని మండిపడ్డారు. జనసేన మాట్లాడేవరకు ప్రభుత్వంలో చలనం రాలేదని ఎద్దేవా చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే దళారులు మనకు వద్దని ప్రజలకు సూచించారు. రైతులకు సాయం చేసే దళారీ వ్యవస్థ కావాలన్నారు. 3 వేల మంది కౌలురైతులకు బీమా పథకం వర్తింపజేయాలని పవన్ డిమాండ్ చేశారు.