2024కు ముందే ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. మైనారిటీలే టార్గెట్‌?

యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఎక్కువయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే కచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా భోపాల్ పర్యటనలో దీనిపై హింట్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్ ధామీ.. ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జోరందుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత శివపాల్ యాదవ్.. యూసీసీని కచ్చితంగా అమలు చేయాలన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని మ‌తాల‌కు ఒకే నిబంధ‌న

బీజేపీ పాలిత గోవాలో మాత్రమే ప్రస్తుతం యూసీసీ అమల్లో ఉంది. 1961కి ముందు నుంచే పోర్చుగీస్ వారు పాలించే సమయం లోనే దీన్ని గోవాలో అమల్లోకి తెచ్చారు. యూసీసీ అమల్లోకి వస్తే అన్ని మతాలకు ఒకే నిబంధన వర్తించేలా కొత్త చట్టం వస్తుంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఇలా అన్ని విషయాల్లో మతాలకు అతీతంగా అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన ఉంటుంది. అయితే యూసీసీ గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? లేక 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను ఇది సూచిస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బీజేపీ ఎజెండాలో..

యూసీసీ అంశం బీజేపీ ఎజెండాలో ఎప్పటినుంచో ఉంది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని ఎత్తివేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగించడం వంటివి చూస్తే యూసీసీ అమలుపై కూడా బీజేపీ వెనకడుగు వేసే సూచనలు కన్పించడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. రామమందిర నిర్మాణం పూర్తి చేసి, దేశంలో యూనిపాం సివిల్ కోడ్ను అమల్లోకి తెచ్చిన తర్వాతే భాజపా ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జరగుతోంది.

మైనారిటీలకు వ్యతిరేకంగానే యూసీసీని అమలు చేస్తున్నామనే భావనను ప్రజల్లో తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పలువురు మతపెద్దలు మాత్రం మైనారిటీల్లో అయోమయం సృష్టించేందుకే యూసీసీని తెరపైకి తెస్తున్నారని పేర్కొన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ మైనారిటీలకు వ్యతిరేకం కాదని, కానీ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించాలని వారు భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నిరసనల బాట పట్టకుండా వ్యవహార జ్ఞానంతో ఉండాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.