తెలంగాణలో ఇంటి పార్టీ ని ఢీ కొనడం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు. గులాబీ దండు బాగానే ఉంది. పనిచేస్తుంది. విమర్శలు ఉన్నా, ఆర్థిక సంబంధ ఆరోపణలు నేరాలు ఉన్నాక కూడా బాగానే పేరు తెచ్చుకుంటుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఎక్కువగా వచ్చిన విమర్శలు క్రమంగా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అంటే ఆ పార్టీ ద బెస్టు అని కాదు కానీ, వాటిపై ఎన్ని సార్లు మాట్లాడినా జనం పెద్దగా ఆకర్షితులు కావడం లేదు.
ఫాం హౌస్ రాజకీయం పై కానీ లేదా జాగృతికి సంబంధించి కానీ విపక్షాలు ఏం మాట్లాడినా ఆఖరికి డ్రగ్ ఛాలెంజ్ పై కూడా మాట్లాడినా ఎవ్వరూ పెద్దగా పరిగణించడం లేదు. అందుకు గాంధీ భవన్ కారణం. ఒక నాడు ఆ నందన వనాన వికసించిన పూలు లేవు. ఉన్నవన్నీ ముళ్లే !
ఒకనాడు అధికార దర్పంతో ఊగిపోయిన వాళ్లంతా వయస్సు మీరి పోయిన వారయిపోయారు. రేవంత్ డీఎన్ఏ పై ఇప్పటికీ చర్చలు నడుస్తున్నందున ఆయనను కోమటిరెడ్డి మరియు జగ్గారెడ్డి అంగీకరించారు. వీళ్లందరిదీ ఓ దారి వీహెచ్ లాంటి నేతలది మరో దారి. దారి ఎలా ఉన్నా కూడా గాంధీభవన్ వాస్తు మార్చినా కూడా వాస్తవాలు మాత్రం మారిపోవడం లేదు. ఈ దశలో పార్టీకి పూర్వ వైభవం దక్కడం కష్టం కానీ కనీసం పరువు నిలబెట్టుకుంటే చాలు అన్న వాదనకు బలం చేకూర్చేందుకు రేవంత్ రెడ్డి (పీసీసీ బాస్) ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇందుకు ఆయన పాదయాత్ర ఒక్కటే ప్రథమావధి అని, పరమావధి అని భావించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే హై కమండ్ మాత్రం ఆయనకు మద్దతుగా లేదు. దీంతో పాదయాత్రకు ఆయనొక కొత్త భాష్యం చెప్పారు. తనకు 119 రోజులు చాలు అని, రోజుకో నియోజక వర్గం తిరిగి వస్తానని, పాదయాత్ర అంటే ఇంటిటికీ తిరిగి రావడం కాదని అన్నారు. బాగుంది ఈ పాటి లాజిక్కు వైఎస్ కు తెలియకపోవడం వల్లనేమో ఆయన అంత కష్టపడ్డారు. అదీ ఉమ్మడి రాష్ట్రంలో ! కనీస స్థాయి ఆలోచన లేకుండా కూడా మన నాయకులు మాట్లాడి ఎందుకని నవ్వులు పాలవుతారో ! కదూ!